Sunday, March 1, 2020

Life is a Memory

B002 dated 29.02.T20 at Tadepalligudem.

Hello and welcome back to Eckce.

Due to time constraint I am unable to write this in bilingual.

Let's get into the point straightaway.

మనం జీవితంలో ఎంతో మందిని కలిసినా చివరి రోజుల్లో మనకి అందరూ గుర్తు ఉండరు. కొందరు అసలు మరపురారు. కొందరి గురించి చెప్పటానికి మాటలు కూడా చాలవు. వాళ్ళ గురించి రాయటానికి పేజీలు సరిపోవు. పుస్తకాలు కావాలి.


నేను ఈ రోజు రాయాలి అనుకున్నది ఒక అసాధారణ వ్యక్తి గురించి.

తన గురించి చెప్పగానే తెలిసిన వాళ్ళకి గుర్తొచ్చే మొదటి విషయం అతని డాబుసరితనం. అవును మీరు చదివింది నిజమే.

అతడే
ఆరడుగుల ఆజానుబాహుడు. సకల కళల్లో అపర జ్ఞాని.
ధైర్యం కూడా అసూయ పడే అంత ధీశాలి.
బోధించటంలో నేర్పరి.

అందరూ మొహం చాటేసినప్పుడు అతడు అన్నిట్లో ముందడుగు వేస్తాడు.
అందరూ నోటి మీద చూపుడు వేలు వేసుకున్నప్పుడు అతడు బిగ్గరగా మాట్లాడతాడు.
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా అతడి హాస్యాన్ని బయటకు తీస్తాడు.
అందరి ముందు మాట్లాడటంలో అందరికంటే ముందు ఉంటాడు.
అతడికి నచ్చకపోతే ఎంత నచ్చచెప్పినా వినిపించుకోడు.

అతడో మంచి పాటగాడు.
అతడో క్రికెట్ ఆటగాడు.
ముక్కుసూటి మాటగాడు.
అంతకు మించి అతడు గొప్ప ప్రేమికుడు.

అతడే శ్రీ దుర్గా ప్రసాద్ పులిచర్ల. నాతో పాటు మరో 64 మందితో కలిసి నాలుగేళ్లు కలిసి చదువుకున్న ఒక తెలివైన విద్యార్థి. మా అందరికి నంబర్ 16 ఫరెవర్.

పైన తెలిపిన వాక్యాలేవీ కల్పితాలు కావు. అతడితో నాకున్న అనుభవాలు. ఇవిగో అందులో కొన్ని సందర్భాలు.

అతడికి అమ్మ అంటే అమితమైన ప్రేమ. ఒకసారి వాళ్ళ అమ్మ గురించి చెప్తూ బెస్ట్ కుక్ ఇన్ ద వరల్డ్ అన్నాడంటే అర్ధం చేసుకోవచ్చు.

వాళ్ల అమ్మమ్మ తనకి అన్ని ఇచ్చేది అని తన మొదటి సంపాదనతో ఆమెకి చీర కొనాలి అనేవాడు.

నన్నొకసారి క్లాస్ లో ఒక లెక్చరర్ సెమినార్ ఇమ్మన్నారు. అప్పుడు అతడు నన్ను క్షణాల్లో సిద్ధం చేసి నేను సెమినార్ ఇచ్చేలా నాకు శిక్షణ ఇచ్చేసాడు.

తనకి ఎప్పుడైనా సమస్య వస్తే మాకు చెప్పుకోడు. మాకు సమస్యలొస్తే సలహాలిస్తాడు. అలా అని అతడికి సమస్యలు లేవు అని కాదు. వాటికి కూడా అతడు సమాధానం ఇచ్చుకునేవాడు.

ఒకరోజు మా ఇద్దరిని ఎదో పని మీద బయటకి పంపించినపుడు ఒక లెక్చరర్ పని అయ్యాక ఫోన్ చేయమన్నారు. కాలేజ్ లో ఫోన్ వాడకం నిషిద్ధం అయినా నేను అప్పుడప్పుడు వాడే వాడిని. ఆ రోజు కూడా ఫోన్ ఉన్నప్పటికీ లేదు అన్నట్టుగానే ఉన్నాను కానీ అతడు మీరు సరే అంటే లోపలికెళ్లి ఫొన్ తెస్తాడు మా వాడు అనేశాడు.

మేము ఒకే బెంచి మీద ఎదురెదురు కూర్చుని భోజనం చేసే వాళ్ళం. ఒకరోజు ఎవరో పిలిచారని భోజనం మొదలు పెట్టి బయటకి వెళ్ళాడు. నేను కాసేపు ఎదురు చూసా కానీ నా భోజనం కానిచ్చేసాను. దానితో అతడికి కోపం వచ్చి నన్ను తిట్టాడు. ఎదురు చూడలేదని కాదు. మరెందుకో మరి నాకు గుర్తు లేదు.

ఒకసారి ఉదయం బ్రేక్ లో బయటకి రాగానే వరండా దగ్గర నించుని మేము మాట్లాడుకుంటుంటే అతడు మాత్రం అతడి షూ చూసుకుని నాతో ఇలా అన్నాడు, "నేను ఆరడుగులు, నా షూ రెండు అంగుళాలు వెరసి ఆరడుగుల రెండంగుళాలు".

అతడు మహేష్ బాబుకి అభిమాని. మహేష్ బాబు బయోగ్రఫీ అంతా చెప్పేవాడు. అలాగే బిహేవ్ చేసేవాడు.

అతడికి ఇళయరాజా పాటలంటే బాగా ఇష్టం. అప్పుడప్పడు పాడే వాడు. నన్ను పాడమని అడిగే వాడు. ఇద్దరం కలిసి పాడుకునే వాళ్ళం.

అతడి రోల్ నంబర్ 07ఏ21ఏ1216. మేము డీపీ అంటూ ఉంటాం. సిక్స్టీన్ అంటాం. ఆ రెండూ కలిపి అతడు ఎంతో నిపుణతతో ఒక ఎంబ్లమ్ గా చేసుకున్నాడు.

ఇదే కాదు ఇలా నన్ను ఆశ్చర్య పరిచే ఎంతో విషయం ఉంది అతనిలో. అవి నాకు ఎంత నచ్చేవి అంటే ఇలాంటి సృజనాత్మకత నాలో లేదే అని అసూయ పడే అంత.


సినిమాల గురించి బాగా చెప్పుకొనే వాళ్ళం. సొంతంగా సినిమా  కథలు చెప్పేవాడు. పేరడీ పాటలు రాసేవాడు.

మేము పరస్పరం బాబాయ్ బాబాయ్ అని పిలుచుకునే వాళ్ళం.

పన్నెండేళ్ల మా పరిచయంలో  నాకు అతడు ఇలాంటి జ్ఞాపకాలని ఎన్నో విడిచాడు. అవన్నీ నాలో పదిలంగా ఉన్నాయి. నాకే కాదు నాతో పాటు ఆ అరవైనాలుగు మందికి ఇంతకు మించి వేర్వేరు మంచి జ్ఞాపకాలని పంచిన మిత్రుడు మా దుర్గా ప్రసాద్ మూడు పదులు నిండగానే ప్రాణంగా చూసుకునే అమ్మని తన ప్రాణాన్ని వదిలి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు.

అవును శ్రీ పులిచర్ల దుర్గా ప్రసాద్ 11/12/1989 - 12/12/2019 ఇక మాకు లేడు.




ఒక మనిషి చనిపోయాడు అనగానే అతడి జీవిత చక్రం మన కళ్ళముందు ఒకసారి కదలాడుతుంది. ఆ మనిషి బ్రతికిన జీవితం మీదే అతని చావుకు మనం ఇచ్చే ప్రాధాన్యత బయట పడుతుంది. ఏమంత జీవితం చూసాడని దేవుడు ఇతడిని ఇంత తొందరగా పిలుచుకున్నాడు?
అర్ధాంతరంగా చనిపోలేదు కానీ అందరికి చెప్పే చనిపోయాడు నా మిత్రుడు.
మరణంతో కూడా ఎంతో మానసిక ధైర్యంతో పోరాడిన రణధీరుడు.

అతడి చివరి రోజుల్లో నేను ఒకటే మాట చెప్పాలని వెళ్ళాను. కానీ అతడి స్థితిని చూసి నేను మూగబోయినప్పుడు అతడే నన్ను దగ్గరకి పిలిచి ఏంటి బాబాయ్ మాట్లాడట్లేదు అని నన్ను ప్రశ్నించాడు. ఎంతో చక్కగా మాట్లాడి బతికేస్తాడు లే అని నాకే నమ్మకం కలిగించాడు. నేను చెప్పాలి అనుకున్నది చెప్పాను. ఎవరి చావు చెప్పి రాదు. వస్తే పోయే ముందు అందరూ పవిత్రంగానే పోతారు అని. ఆ అవకాశం అతడికి వచ్చింది అని నాకు అనిపించింది అతడికి చెప్పాను.
అతడి చివరి చూపుకు నోచుకోలేకపోయాను కానీ చివరి వరకు అతడి చూపుని మరచిపోను.

దుర్గా ప్రసాద్ జీవితం నాకు ఒక పాఠం నేర్పింది. ఏది శాశ్వతం కాదు. మన శారీరక స్థితి ఆర్ధిక పరిస్థితి ఇవేమీ శాశ్వతం కాదు. కేవలం మన జీవితంలో మనం ఎంతమందికి ఒక మంచి జ్ఞాపకంగా ఉన్నాము? అనేది మాత్రమే శాశ్వతం. ఎలాంటి దురలవాట్లు లేని ఒక వ్యక్తి, ఒక అమ్మాయిని ప్రేమించాడు అని పుకారు కూడా వినిపించని ఒక బుద్ధిమంతుడు ఇలా శారీరక అస్వస్థతకు గురయ్యాడు అంటే ఇదే కదా విధి అంటే.
అందం, ఆరోగ్యం వీటిని నేను కాపాడుకోవాలి కానీ వాటిని చూసి అతిశయించకూడదు. జీవితంలో ఎన్ని సాధించినా జీవితాన్ని సాధించగలిగితేనే ఆ జీవితానికి ఒక అర్ధం. 
అవును. దుర్గా ప్రసాద్ నాకు ఒక మంచి జ్ఞాపకం. చనిపోయిన తర్వాత కూడా మూడు సార్లు నా కలలోకి తిరిగి బతికి వచ్చినట్టుగా వచ్చిన అతడు అమరుడు. ఇదే అతడికి నా అశ్రు నివాళి.


-Eckce

3 comments:

Unknown said...

Nice ....You are doing good day by day ..Is it takes place in RRG?

lalitha said...

Yes.... DP, u are always alive in our hearts..... selavu mastaru

ME AND BIBLE AND JESUS said...

Oka manishi ga merey intha ishtapadithey hrudayam erigina devudu inkentha ishtapadi untaru andukey thanatho paatu undatanki pilchukunnaru

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...