Sunday, December 12, 2021

The Day of Death

B034 dated at Tadepalligudem the 12.12.T21


ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అని ఒక జ్ఞాని అన్నారు. బతుకంతా ఏడుపుగొట్టుదే అనే సంకేతంతో మాటలు నేర్చుకునే ముందే ఏడుపు చేర్చుకుని పుడతాం. ఎవరైనా ఏడిపించే వరకు నవ్వుతూ ఉండే వయసు నుంచి ఎవరో ఒకరు నవ్విస్తే గాని నవ్వలేని వయసు వరకు జీవితం అంతా మల్లయుద్ధమే. ప్రతి మనిషి తన వ్యక్తిత్వాన్ని బట్టి ప్రత్యర్థి వ్యక్తిత్వంతో పోటీ పడుతూ పడి లేస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో తనతో తానే వైరం పెంచుకుంటాడు. బ్రతకడం కోసం చస్తూ ఉండే జీవితం గడుపుతూ పరిస్థితికి తగ్గ భావాల్ని బయటకి పలికిస్తూ లోపల ఏడుస్తూనే ఉంటాడు.

మొదట చెప్పిన మాట విషయానికొస్తే కొన్ని ఎన్నటికీ మారవు అనుకుని కూడా మారిపోయిన కొన్నిటిలో ఒకటి చావుకి మనం ఇచ్చే విలువ. చావుకి విలువ ఇవ్వటం అంటే అర్థం బ్రతుక్కి విలువ ఇవ్వటమే. బ్రతుక్కి విలువ ఇస్తేనే చావు కి మర్యాద ఇచ్చినట్టు అవుతుంది. ఒకరు బ్రతికిన ఒరిజినల్ బ్రతుకంతా బట్టబయలు అయ్యేది ఆ ఒకరు చనిపోయిన తర్వాతే. జీవం ఉన్నంత కాలం ఎన్ని జోకులేసినా అది పోయినాకే జీవితం గురించి మాట్లాడతారు. బ్రతికున్నంత వరకు వారి గొప్పతనాన్ని ఎరుగని లోకం చనిపోయాక మాత్రం ఆకాశానికి ఎత్తేస్తుంది. అదే మరణం యొక్క విలువ. బ్రతికినంతకాలం గుర్తింపు ఆశించకుండా పని చేయగలిగిన వారినే ప్రపంచం వారు పోయిన తర్వాత గుర్తిస్తుంది.

బ్రతికున్నంతకాలం పుట్టినరోజు జ్ఞప్తి చేసుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ చనిపోయాక కూడా వారి జయంతిని వర్ధంతిని జ్ఞప్తి చేసుకునే మనసుల్ని గెలిచిన బ్రతుకు బ్రతికినవారు ఎందరో.

ఒకరు మనకి గుర్తు ఉండాలి అంటే వారి పరిచయం మనతో ఉండాలి. లేకపోతే వారి ప్రభావం అయినా మన మీద ఉండాలి. అలా ఉండాలి అంటే వారు చాలా గొప్పవారు అయ్యి ఉండాలి, లేదంటే చెడ్డవారు అయినా ఉండాలి. అదీ కాదంటే ఎవరైనా వారి గురించి బలవంతంగా మనలోనికి చొచ్చి ఉండాలి. ఈ బలవంతపు చొచ్చింపు వల్ల మనం ఎందరో వ్యక్తులకి సాధారణ అభిమానులుగా ఉన్నాం. వారి జనన మరణ నమోదు మనలో ముద్రించబడింది.

కానీ కొందరు మాత్రం మన సొంత అనుభవ అభిప్రాయపు అభిమానం లోనుంచి ఆవిర్భవిస్తారు. వారు మరణించినా మన మనసుల్లో జీవించే ఉంటారు. ప్రతి రోజు కాకపోయినా వారు పంచిన జ్ఞాపకాల ఆనవాళ్లు మళ్ళీ ఎదురైతే వాళ్లే గుర్తొస్తారు.

కుటుంబంలో వ్యక్తులు, బంధువులు, స్నేహితులు, కొంచమే పరిచయం ఉన్నా మంచి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు.

శత్రువు కూడా చచ్చాక మనకి ఏదో మూల జాలి కలుగుతుంది అయ్యో పోయాడే అని. వీడు చస్తే దరిద్రం పోతుంది అని మాటల్లో అన్నప్పటికీ మనసులో మాత్రం అలా ఎవరం అనుకోము సాధారణంగా. 

ఎందుకంటే శత్రువు మీద గెలవాలి అనుకోవటం యుద్ధం అవుతుంది కానీ శత్రువు చావాలి అనుకుంటే అది పైశాచికం అవుతుంది కదా. కానీ చేసిన చిన్న మోసానికే, జరిగిన కొంత అన్యాయానికే శత్రువు కాళ్ళు చేతులు పడిపోవాలి, ఉసురు తగలాలి, అడుక్కు తినే పరిస్థితి రావాలి అని కోరుకుంటూ, చనిపోయిన తర్వాత కూడా కుక్క చావు చచ్చాడు అని ఆనందపడే వ్యక్తుల్ని నేను దగ్గర నుంచి చూసాను. అలాంటి వాళ్ళ గురించి ఒకటే మాట అనగలం. వాళ్ళ మనస్తత్వమే చెప్తుంది వాళ్లకి అలా అనుకోవాల్సిన పరిస్థితి రావటానికి కారణం.

ఇక మనతో ఉంటూ మనల్ని విడిచి ఎందరో వెళ్లిపోయారు. పోయిన మన పూర్వీకులే ఇందుకు సాక్ష్యం. ఇంకా వెళ్ళిపోతారు. వయసుమళ్లి కాటికి కాళ్ళు చాపిన ముసలితనమే నిదర్శనం. తర్వాత మనం కూడా వెళ్లిపోతాం. ఎందుకంటే అందరి చివరి గమ్యం మరణమే. ఇది అందరికీ జరిగేదే. అలా వెళ్లిపోయిన చాలా మందిని తొందరగానే మర్చిపోయేలా బిజీ జీవితం మనకి ఉండటం కూడా అందరకీ జరిగేదే. పోయిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి అని కొందరు అనుకుంటారు, పోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుని బాధపడకూడదు, జ్ఞాపకం చేసి మిగిలిన వాళ్ళని బాధపెట్టకూడదు అని కొందరు భావిస్తారు. ఈ రోజుల్లో అయితే ఒకరు పోయారు అనగానే అయ్యో అనటం కూడా మానేసి అవునా అంటున్నారు. మనలో చాలా మందికి చావు పలకరింపును కూడా హ్యాండిల్ చెయ్యటం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కొందరి చావుల్ని నిర్లక్ష్యం చేసి ఉంటాం కూడా. అది మనం మరణానికి విలువ ఇచ్చినట్టా ఇవ్వనట్టా అనేదానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. కొంతమంది అయితే చావు గురించి మాట్లాడటం కూడా నేరం, పాపం, అపశకునం అంటారు. మాట్లాడినప్పుడు మన నోరు కూడా మూసేస్తారు వాళ్ళ చేతుల్తో. అదేంటో, తథాస్తు దేవతల భక్తులేమో వాళ్ళు. సినిమాల ప్రభావం కూడా సగం కారణమే. ఇది చదువుతూ కూడా అలా భావించే వాళ్ళు ఉండరు అనుకుంటున్నా.

తప్పకుండా జరిగేది, ఎవరూ తప్పించలేనిది, ఎక్కువ మందిని భయపెట్టేది అయిన ఒక విషయం గురించి మాట్లాడుకోవడం తప్పేమీ కాదు. నిజానికి ఇపుడు అవసరం అనిపించింది. మన భవిష్యత్తు, పెళ్లి, పిల్లలు ఇవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు మన చావుని కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. ఎప్పుడు, ఎలా అనేది చెయ్యకూడదు. అలా చేస్తే నేరం.  

మూత పెట్టి దాచి పెట్టిన రసాయనం బయటకి వచ్చే వరకు సీసాలో ఎంత భద్రంగా ఉంటుందో మూత తీసి బయటకి తెచ్చిన తర్వాత ఎంత ఉపయోగకరంగా పనిచేస్తుందో అలాగే సీసా అనే బ్రతుకులో మూత అనే చావు యొక్క భద్రతలో రసాయనం అనే  వ్యక్తిత్వంగా ఉన్నాము.

ప్రతి రసాయనానికి ప్రాధమిక కర్తవ్యం ఉన్నట్టే ప్రతి జీవికి ఉంటుంది. మనిషికి ఉన్న కొన్ని ప్రాథమిక కర్తవ్యాల్లో ఒకటి మనిషిగా బ్రతకడం. అది ఒక్కటి చేస్తే చాలు. మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండటానికి. అలా బ్రతికిన వాడే మా దుర్గా ప్రసాద్. 

పుట్టి 31 సంవత్సరాలే అయింది. కానీ చనిపోయి 2 సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా మా అనుభవాల్లో జీవించే ఉన్నాడు. ఒక రోజు వ్యత్యాసంలో తన జనన మరణాల్ని ధృవీకరించుకుని మా మధ్య ఒక వెలుగు వెలిగిన ధ్రువ తార.

(11.12.1990 - 12.12.2019)

అతని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా రాయటం కాదు కానీ అతని మరణదినాన్ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా అతను గడిపిన జీవితాన్ని స్మరించుకునే సందర్భంలో భాగమే ఇది.

Life is a memory and his memories are with us.

DP lives on....


-eckce

3 comments:

lalitha said...

Miss you DP, still we remember your sarcastic words which adds smile to our faces.

RIP, earth is not good, enjoy there man

Avb1994 said...

మొత్తం చదివిన తర్వాత మాటల్లో వర్ణించలేని ఒక భిన్నమైన స్థితి లోకి వెళ్ళిపోయాను.చాలా ఆలోచింప చేసేలా ఉంది.

Unknown said...

రాజు గారు మంచిగా రాసారు 👍👍

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...