Thursday, May 12, 2022

అమ్మమ్మ డాట్ కామ్.

B037 dated at Appanaramunilanka the 11.05.T22.


ఇప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఊరిలో ఉన్నాను. చివరిగా ఇక్కడికి వచ్చింది 2018 మార్చ్ లో మా అన్నయ్య పెళ్లికి. మళ్ళీ ఈ రోజే.

మా తాతయ్య వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. కానీ మా అమ్మమ్మ, తాతయ్యలకు మా అమ్మ మాత్రమే సంతానం. కాబట్టి నాకు స్వయానా మేనమామలు లేరు కానీ మావయ్యలు, చిన్నమ్మలు, బావ, బావ మర్దిలు, మరదళ్లు ఉన్నారు.


చిన్నప్పుడు ప్రతి వేసవి సెలవులకు నేను మా అక్క మా చెల్లి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఒకసారి అయితే మా తాతయ్యకు నేను ఉత్తరం రాశాను, నాకు 51 రోజులు వేసవి సెలవులు ఇచ్చారు. మమ్మల్ని తీసుకెళ్ల టానికి మీరు రండి అని. అది చదివి వాళ్ళు నవ్వుకున్నారంట.


మా తాతయ్య వాళ్ళు గోదావరిలో వేటకు వెళ్ళి తెల్లవారుజామున పెద్ద వలలో చిన్న చిన్న చేపలు తెచ్చేవారు. మేము అరుగు మీద కూర్చుని వాటిని ఏరి మళ్ళీ అమ్మకానికి పంపటంలో సాయం చేసేవాళ్ళం. 


నాకు బాగా దగ్గరగా ఉండేది మా అక్క వయసువాడు మా బావ, మా చెల్లి వయసు వాడు మా బావమరిది. మా బావ క్లాస్మేట్ మా చిన్నమ్మ. వాళ్ళు అపుడు హై స్కూల్ లో ఒకే క్లాస్ చదివేవారు. మా బావ నన్ను సైకిల్ మీద తిప్పేవాడు. అలా ఒకసారి రోడ్ మీద వెళ్తుంటే వాళ్ల టీచర్ ఎదురయ్యారు అని మా బావ సైకిల్ దిగి గుడ్ ఈవినింగ్ చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఆ మర్యాద. 





అమ్మమ్మ గారి ఇల్లు నాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. నా చిన్నతనానికి వన్నె తెచ్చింది నేను అక్కడ ఉన్నన్ని రోజులే అనటంలో అతిశయోక్తి ఉన్నా అదే నిజం. 

ఒక్కొక్కటి గా చెప్పాలి అంటే కష్టం కాదు కానీ ఇష్టం వచ్చినట్టే చెప్తాను.


సీమ చింతకాయలు చాలా రుచిగా ఉండేవి. పంపర పనసకాయ పుల్లగా ఎర్రగా భలే ఉండేది. తోటలో మామిడికాయలు కోసం వెళ్ళినపుడు మా బావ అవి కలెక్టర్ కాయలు అన్నాడు: అపుడు నేను అవి కలెక్టర్ గారి చెట్ల మామిడికాయలేమో అని భ్రమ పడ్డాను.

ప్రతి సంక్రాంతికి అక్కడ పండగ బ్రహ్మాండం గా జరిగేది. మేము ఒకో సంవత్సరం వెళ్ళే వాళ్ళం. వెళ్తే మాత్రం కొత్త బట్టలేసుకుని తీర్థం (ఇప్పటికీ నేను ఆ కొట్లు ఉండే ఎగ్జిబిషన్ లాంటి వాతావరణాన్ని తీర్థం అనటం అలవాటు) వెళ్ళటం, అక్కడ పట్ట పగలే జరిగే డాన్స్ ప్రోగ్రాం చూడటం, తిరిగి తిరిగి అలసిపోయి ఏవో బొమ్మలు, పప్పలు కొనుక్కుని బుడగలతో ఆడుకుంటూ ఇంటికి రావడం. అలా ఒక సంవత్సరం అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలోని కాలేజీకి టీనేజికి అనే పాటకి డాన్స్ చేస్తున్నారు అని విన్న మా బావకి పూనకాలు ఒకటే తక్కువ. అపుడు నేను కూడా ఎంజాయ్ చేశా. 


మా బావ డబ్బుల ఆట ఆడేవాడు. ఏట్లు అని ఏదో అనేవారు. ఒకడు కాయిన్ గాల్లోకి ఎగరెస్తే మిగిలిన వాళ్ళు బొమ్మ బొరుసు పందెం కాసుకోవాలి అని మాత్రం గుర్తు ఉంది. అది కరెక్టో కాదో కూడా తెలియదు. ఎందుకంటే నాకు అపుడు అర్థం అయ్యేది కాదు కూడా.


అప్పట్లో కొత్త సినిమాల్లో పాటలు పాడుకోవటం కోసం లిరిక్స్ పుస్తకాలు అమ్మేవారు. ఒక్కో సినిమా పుస్తకం ఒక్క రూపాయి. నాకు గుర్తు నేను జీన్స్, ప్రేమంటే ఇదేరా పాటల పుస్తకాలు కొనుక్కున్నాను.


మేము మలికిపురం సినిమాకి వెళ్ళే వాళ్ళం. నేను చూసిన సినిమాలు పెళ్లి, పెళ్లి చేసుకుందాం, ఏవండీ పెళ్లి చేసుకుందాం, సమరసింహారెడ్డి.పద్మజ, శంకర్ అనే థియేటర్ పేర్లు గుర్తున్నాయి.

పెళ్లి చేసుకుందాం అనే సినిమాకి ఆడాళ్ళతో కలిసి చాలామంది వెళ్ళాం. అపుడు నేను చిన్న పిల్లాడిని అని నాకు టికెట్ తీయకుండా నన్ను సినిమా హల్ లోకి తోసి తలుపు మూసేశారు. నాకు భయం వేసి ఎడ్చేసాను. అపుడు వెంకటేష్ ఎంట్రీ సీన్ లో జాగింగ్ చేస్తున్నాడు. వాళ్ళు చేసేది లేక నాకు టికెట్ తీసుకున్నారు.


ఇంకోసారి ఏదో సినిమాకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మా బావ ఒక ఐస్ ఫ్యాక్టరీ కి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోవటం తో మేమే పుల్ల ఐస్ లు తీసుకుని తినేసాం. ఎవరో దూరం నుంచి అరిస్తే పారిపోయి వచ్చేశాం. 


అమ్మమ్మ గారి ఇల్లు అంటే బాగా గుర్తు వచ్చేది పసరు మందు. దాదాపు ప్రతి ఏడు నాకు మా చెల్లికి పచ్చ కామెర్లు వచ్చేవి. అపుడు మమ్మల్ని ఈ ఊరు పంపే వారు. ఎన్ని రోజులో గుర్తు లేదు కానీ, రోజూ పొద్దున్నే కళ్ళలో పసరు మందు పోసేవారు. మధ్యాహ్నం వరకు ఏడుపే. ఆ విధంగా నరకం అంటే ఏంటో చిన్నప్పుడే చూసా నేను. కళ్ళు మండుతున్నాయి అంటే బెల్లం ముక్క చేతిలో పెట్టేవారు. ఆ కొన్ని రోజులు పత్యం చెయ్యాలి. కేవలం మజ్జిగ అన్నమే తినాలి. కొన్ని చోట్ల చేతికి చురక వేస్తారు కానీ మా బ్రాండ్ మాత్రం పసరు మందే. 


అక్కడ పొద్దున్నే ఇంటింటికీ తిరిగి ఎవరో ఇడ్లీ అమ్మేవారు. స్టీల్ డబ్బాల్లో పెట్టిన ఆ వేడి ఇడ్లీ, రుచికరమైన చట్నీ అదిరిపోయేది. 



ఇంకో బంపర్ ఆఫర్ ఉంది అక్కడ. ఎక్కువ వర్షం వస్తే ఊర్లోకి వరద వస్తుంది. అలా వరద వచ్చినప్పుడు రెండు సార్లు అనుకుంట నేను అక్కడికి వెళ్ళా. ఇల్లులు అన్ని మునిగిపోతే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళటానికి అరటి బొందలతో పడవలు చేసి వాటి మీద వెళ్ళే వాళ్ళం. ఆ బురద నీటిలోనే ఈత కొట్టేవాళ్ళు.



అక్కడ ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉంటాయ్. మా ఇళ్ల ముందే దున్నిన నేల మీద ఉంటాయ్ తోటలాగా. ఆ నేల ఎండ కాస్తే గడ్డ కట్టి ఉంటుంది. వాన కురిస్తే మాత్రం కుమ్మరి చేతిలో కుండ అవ్వటానికి సిద్దం. ఆ మట్టితో మేము బండ్లు, బొమ్మలు చేసుకుని ఆడుకునే వాళ్ళం. మా ఇంటికి మా బావ వాళ్ల ఇంటికి మధ్యలో ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు మూగ వాళ్ళే. వాళ్లతో ఈ బొమ్మల ఆటలు బాగా ఆడే వాళ్ళం నేను మా బామ్మర్ది. 


ఒకసారి అర్ధరాత్రి ఎవరో దీపాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోవటం వల్ల అగ్ని ప్రమాదం జరిగి చాలా ఇళ్లు కాలిపోయాయి. ఆ తర్వాత మంచి ఇళ్లు కట్టుకున్నారు వాళ్ళు. మా తాత గారిది మాత్రం పెంకుటిల్లు. 

వేసవిలో జ్యూస్ తాగడం కోసం 2 కిలో మీటర్ల దూరంలో ఉండే సెంటర్ కి వెళ్ళే వాళ్ళం. ఆ జ్యూస్ పాయింట్ లో ప్రేమ కథ సినిమాలో సీన్స్, పాటలు చూసిన గుర్తు. 

నువ్వు వస్తావని సినిమా లో పాటలు బాగా పాడుకునే రోజుల్లో వాలీ బాల్ ఆడే వారు అక్కడ ఎక్కువగా. నేను చూడటం మాత్రమేలే. క్రికెట్ అసలు ఎప్పుడు ఆడలేదు. 


మా బావ వాళ్ల నానమ్మ, మా అమ్మకి పెద్దమ్మ అయిన మామ్మని సంతమామ్మ అనే వాళ్ళం. ప్రతి వారం సంతకి వెళ్లి మాకు పప్పలు తెచ్చేది. మా చెల్లి అంటే బాగా ఇష్టపడేది.


ప్రతి విషయం నేను చూపించే సినిమా ఆధారాల ప్రకారం 2000 సంవత్సరానికి ముందే జరిగినట్టు అనిపిస్తుంది కదా. నిజమే 2000/2001 లో ఒక విషాదం చోటు చేసుకుంది. ఒకరోజు అర్ధరాత్రి మా ఇంటికి ఒక కబురు రాగానే మా నాన్న మా అందరినీ లేపి సిద్దం చేసి అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాలి అని తీసుకెళ్లారు. ఇది తూరుపు గోదావరి. అంటే మధ్యలో గోదావరి దాటాలి. అలాగే దాటి వచ్చాక తెలిసింది. మా అమ్మమ్మ చనిపోయింది అని. వయసు మళ్ళి చనిపోయింది అని అనుకోక తప్పలేదు. ఆ ఏడాదే బెంగతో మా తాత చనిపోయాడు. తర్వాత స్వతహాగా ఈ ఊరితో బంధం బాంధవ్యం తెగిపోయింది. కొన్ని గొడవలు కొనసాగినా బంధం మళ్ళీ కలవలేదు. 


2006 లో సంక్రాంతికి ఒకసారి వెళ్ళాం మా బావ ఇంటికి. అప్పుడు తన ఫ్రెండ్స్ తో లక్ష్మి సినిమాకి తీసుకెళ్ళాడు. అంతే, మళ్ళీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. 


2010 లో తన పెళ్ళికి వెళ్ళాం మళ్ళీ. అమ్మమ్మ తాతయ్య లేరు, వాళ్ళు ఉన్న ఇల్లు కూడా అమ్మేసాక అక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ మా బావ మాత్రం ఏ అవసరం వచ్చినా నాకు ఎప్పుడూ తోడుగానే ఉన్నాడు. నేను తన దగ్గరకి నా ఫ్రెండ్ తో ఎన్నో సార్లు వెళ్ళాను. మా అమ్మ ఆ ఊర్లో నాకు సంబంధం చూసినా నేనే చేసుకోలేదు. 

మళ్ళీ 2018 తర్వాత 2022 లోనే మా బావమరిది పెళ్లికి ఇక్కడికి వచ్చాను. 

మంచి విషయం ఏమిటి అంటే అపుడు దేవుని కోసం కూడి మేము ప్రార్థనలు చేసేవాళ్ళం. అప్పట్లో ఉన్న ఏ ఒక్క మంచి అలవాటు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో గానీ నాలో గానీ లేదు.

ఇంకా ఎన్నో రాయాల్సి ఉన్నా నిద్ర వస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ అప్పట్లో అనుభవించిన అనుభూతులు మీరు ఎప్పుడైనా ఆస్వాదించారు అంటే సందేహం అనే అంటాను. ఎందుకంటే అవి నేను మా ఊర్లో కూడా అనుభవించలేదు. అప్పట్లో ఉండే కొన్ని అలవాట్లు ఇప్పుడు అక్కడే కాదు ఎక్కడా లేవు. 

ప్రతి ఒక్కరికీ అమ్మమ్మ గారిల్లు ఒక తీపి జ్ఞాపకమే కదా. It's an Emotion. 


-eckce.

3 comments:

Unknown said...

ఇప్పుడు ఎన్ని music ప్లేయర్స్ ఉన్నా..అప్పటి పాటల పుస్తకం కన్నా దిగదుడుపే..

Santu said...

Nice

JvsVani said...

చిన్ననాటి జ్ఞాపకాలు మాకు కూడా గుర్తు చేశారు.. ఇలాంటివి అప్పట్లో స్వాతి పుస్తకంలో చదివే వాళ్ళం..ఇంత మంచి రచయిత మాకు తెలుసు అని చెప్పుకోవడానికి సంతోషంగానూ గర్వంగానూ ఉంది

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...