Thursday, April 7, 2022

Powerless Tri-wing

B035 dated at Tadepalligudem the 07.04.T22


రెండు రెక్కలు ఉంటే పక్షి. మూడు/ నాలుగు రెక్కలు ఉంటే అది ఫ్యాన్. ఆ ఫ్యాన్ తిరిగినంతసేపే దానికి విలువ. అది తిరగాలంటే కావలసిన ఇంధనం లేకపోతే ఏంటి పరిస్థితి? అదే పరిస్థితి లో రెండు గంటల నుంచి ఉన్నాను. కట్టలు తెంచుకున్న కోపంతో ఉన్నాను. ఆ కోపాన్నంతా రాసే ఖాళీ గా కూడా లేను. సరిగ్గా అర్ధరాత్రి 1.19 నుంచి ఇప్పుడు 2.55 వరకు విసినకర్ర తో పిల్లలిద్దరికి విసురుతూ ఉన్నాను. కళ్ళలో నిద్ర పోయింది. చేతుల్లో జివా పోయింది. చిన్నప్పుడు ఒక జోక్ ఉండేది, గొప్ప గొప్ప నాయకులు అందరూ రాత్రి వీధి దీపాల కింద చదువుకున్నారు అంటే, ఆ నా కొడుకులు పగలంతా ఏం పీకేవారు అని. అదే పదం ఇప్పుడు వాడాలి అనిపిస్తుంది. కావాలని ఇలా అర్ధరాత్రి నిద్రపోతున్న వాళ్ళని లేపి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే పగటి పూట తీసుకోవచ్చు కదా.


దీని వెనక కూడా ఏదో లాజిక్ పుట్టిస్తారు ఆ ఫ్యాన్ కి ఉన్న ఫ్యాన్స్. 

అంశం మీద నిజాయితీగా స్పందించకుండా వంశం మీద నిష్కారణంగా నిందలేస్తున్నారని భావించే స్వార్ధపు సైన్యం ఉన్నంత కాలం ఈ నిరంకుశత్వాన్ని నియంత్రించలేం. కనీసం నిలదీయలేం. ఈ ఒక్క విషయమే కాదు, ఈ ఒక్క వర్గమే కాదు. అసలు లోకంలో వర్గాలు అనేవి ఉన్నంతకాలం వాళ్ళ వెనక వెర్రి సైన్యాలు వెంపర్లాడటం జరిగినంత కాలం ఇలా వంకర జీవితాలు తప్పవు.


నేను చెప్పింది సరిగ్గా అర్థం అయిందో లేదో............................................. ఇప్పుడు వచ్చింది అండీ కరెంటూ 3.05 కి. ఇలా రోజూ రెండు గంటలు తప్పదు అని బయట టాక్. ఇది కొత్తేమీ కాదు నా చిన్నప్పుడు కూడా రోజుకి రెండు గంటలు షెడ్యూల్డ్ పవర్ కట్ ఉండేది. ఒక వారం ఉదయం రెండు గంటలు, ఆ మరుసటి వారం సాయంత్రం రెండు గంటలు. అందరం దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఉదయం కరెంట్ పోయే ఆదివారం మాత్రం కొంచెం బాధ పడే వాళ్ళం. ఎందుకంటే ఈ టీవీ లో వచ్చే ఏదో మంచి ప్రోగ్రాం మిస్ అయ్యే వాళ్ళం. ఇప్పట్లో లా అపుడు ఇన్వర్టర్ లు ఉండేవి కావో, అలాంటివి ఉంటాయ్ అని మాకు తెలియదో, తెలిసినా అంత స్థోమత లేదో గానీ అప్పుడు సమస్య కూడా చాలా సామరస్యంగా, అంతకంటే సామాన్యంగా ఉండేది కానీ ఇప్పటిలా ఇంత వింతగా మాత్రం ఉండేది కాదు.



నేను చెప్పింది సరిగ్గా అర్థం అయిందో లేదో................ ఉదాహరణకి కొందరు సామాన్య ప్రజలకి కొంతమంది సెలబ్రిటీలు బాగా నచ్చుతారు. చాలా మంచిది. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటాయి. మనం కూడా వాళ్ళ ఇష్టాల్ని గౌరవించాలి. నాక్కూడా చాలా మంది నచ్చుతారు. నా కారణాలు నాకు ఉంటాయి. నాకు ఎందుకు నచ్చారో అదే కారణం వల్ల నాకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి నచ్చరు. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటాయి. ఇది ఇంత వరకే ఉండాలి. అంతే కానీ నాకు నచ్చిన వాళ్ళు ఏమి చేసినా నేను వాళ్ళకి వత్తాసు పలుకుతూనే ఉండాలి అంటే అది నా సొంత వ్యక్తిత్వానికి అవమానం. ఇదే అవమానపు లక్షణాల్ని చాలా మంది తుంగలో తిక్కేస్తూ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుని ఎంతో మందిని తప్పు దోవలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాదు, చాలా పాపం చేస్తున్నారు. నచ్చని పని చేసినపుడు నచ్చిన మనిషిని అయినా ఆ విషయంలో ఖండించాలి. నచ్చిన పని చేసినపుడు నచ్చని మనిషిని కూడా ప్రశంసించాలి. ఈ మాత్రం చేయలేకపోతే మనిషికి ఉన్న ఆలోచన అందులో ఇమిడి ఉండాల్సిన ఇంగితం గంగలో కలిసినట్టే.


ఈ మధ్య ప్రతి మనిషీ రాజకీయ నాయకుడిలాగా, ప్రజా ప్రతినిధి లాగా, సామాజిక కార్యకర్త లాగా ప్రవర్తిస్తున్నాడు. సామాన్య పౌరుడిగా మాత్రం ఉండలేకపోతున్నారు. హక్కుల్ని వినియోగించుకోలేక ఎవరో ఒకరి పక్కన నిలబడి అన్ని విషయాల్లోనూ అదే పక్షాన అదే చోట అదే పొజిషన్ లో అలాగే నిలబడి చోద్యం చూస్తూనో లేక దాన్ని ప్రోత్సహిస్తూనో కాలం గడిపేస్తున్నారు. అలా చేస్తూ కొందరు లాభం కూడా గడిస్తున్నారు. అది మంచిదే. కానీ ఎలాంటి లాభం లేకుండా ఒక అబద్ధపు ఎమోషన్ తో చిక్కు ముడిలో ఇరుక్కుని పాములాంటి పాలకులకి పావుల్లా వాడబడుతూ ఉంటున్న దేశీ పావురాలకి పూర్వం నుంచి పెద్దలు చెప్తూ వచ్చేది ఏంటి అంటే: నీ వ్యక్తిగత జీవితానికి పైన ఒక వలయం గీసి దాని వల్లే నువ్వు ఇంకా జీవించి ఉన్నావని నిన్ను భ్రమకి గురి చేసి నిన్ను ప్రభావితం చేస్తున వాళ్ళ అంతర్యామి నీకు అంతుపట్టనంత కాలం సొంతం అనుకున్న నీదంతా కోల్పోతూనే ఉంటావు.


దేశం కోసం ధర్మ కోసం ఒక సైనికుడిగా పోరాడటానికి నీ దేశం ఇంకా ఎవరి చేతుల్లోనో బందీ గా లేదు. నువ్వే కొందరి చేతల్లో బందీ గా ఉన్నావు. నీ ధర్మం ఎవరి దాన ధర్మాల మీద ఆధారపడి లేదు. నువు చేసే ధర్మమే నిన్ను కాపాడుతుంది.

వ్యక్తి పూజ, వర్గ భజన కంటే

నీ కుటుంబం కోసం నువు చేసే కృషి మాత్రమే నీకు అన్నిటి కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. 



చివరిగా ఒక్క మాట: ఎవడెన్ని కారణాలు చెప్పినా, అర్ధరాత్రి ఇలా కరెంట్ తియ్యటం తప్పు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. 


-eckce 

7 comments:

mohantangella said...

Jai Jagan

Avb1994 said...

నచ్చని పని చేసినపుడు నచ్చిన మనిషి అయినా ఖండించాలి.
నచ్చిన పని చేసినపుడు నచ్చని మనిషి అయినా ప్రశంసించాలి.
👌👌👌👏👏👏👌👌👌

Unknown said...

As steno nijam cheppandi, sontha vyakthitvatanki avamanam ani edo annaru.

Nacchani pani....Nacchina...Enni jarugutunnai

Unknown said...

జిల్లాలు పెరిగాయి అందుకే కరెంట్ సరిపోవడం లేదు అని చెప్తే.అది నిజమే అని గుడ్డిగా నమ్మే ఫాలోయర్స్ ఉన్నంత కాలం ఈ వ్యవస్థ మారదు..

Mohan said...

చాలా బావుంది, ఆలోచింపచేసింది

Unknown said...

ఉచిత పథకాలు కావాలి, కరెంటు కావాలి అంటే ఎలా? ఏదోఒకటి రాజీపడాలి. గవర్నమెంట్ ఆర్ధికపరిస్థితినీ అర్ధంచేసుకొని, ఒక ఇన్వెర్టర్ కోనేసుకో 👍👍

Eckce said...
This comment has been removed by a blog administrator.

Every Emotion is a Business

B051/Business dated at Tadepalligudem the 28.12.T25 Business చాలా రోజులు అయింది. నిజానికి సంవత్సరాలు అయింది ఒక బ్లాగు రాసి. Youtube channel ...