Sunday, September 26, 2021

ఆలోచిస్తే అతిశయమే

B033 dated at Tadepalligudem the 26.09.T21

అత్యంత ఇబ్బందికర విషయం ఏమిటి అంటే నేను ఒకలా ఉండాలి అనుకుని అలా ఉండలేకపోవటం, అందుకు నేనే మళ్ళీ బాధ పడటం. నా అవగాహన బట్టి  నాకు నేనే కొన్ని పరిమితులు పెట్టుకుని వాటికి తగ్గట్టు మసులుకోవాలి అనే షరతుల్లో ఉండాలి అనుకుంటా కానీ నేనే వాటి పరిధిని దాటి నాకు నచ్చని రీతిలో దారి తీరు లేకుండా ఏడుస్తూ ఉంటా. ఇదే మిగతా వాళ్ళకి నాకు తేడా లేకుండా చేస్తుంది అనే బాధ అస్తమాను వెంటాడుతుంది. 

స్వీయకృతాపరాధభావం ఉన్నా కూడా స్వతహాగా ఉన్న తప్పుడు స్వభావం వల్ల మళ్ళీ మళ్ళీ అవే తప్పుడు దారుల్లో నన్ను నడిపిస్తూ వేధిస్తున్న ఆలోచనలు నన్ను కెలికేస్తున్నాయ్.


ఏది అసలైన తృప్తిని ఇస్తుందో తెలియదో లేక ఏది ఉంటే అసలు తృప్తి వస్తుందో తెలియదో గాని ఏది ఉన్నా ఏ తృప్తి లేదు అనిపిస్తుంది. అసలు ఏదీ లేని వాడి పని బాగుంటుందేమో అనిపిస్తుంది. నిజంగా ఒకసారి ఆలోచించాలి అసలు ఏది ఉంటే ఏ బాధ లేకుండా ఉండొచ్చు అనేది. సరదాగా ఇప్పుడే చూద్దాం. ఫుల్లుగా డబ్బులు ఉంటే ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఫుల్ గా డబ్బులు ఉండే కంటే ఫుల్ గా డబ్బులు వస్తూ ఉంటూ అప్పుడప్పుడూ పోతూ ఉంటే బాగుంటుందేమో. చిన్న జలుబు కూడా తెలియకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది? నిజానికి చాలా బాగుంటుంది. అందరికి ఇది అంత ఈజీ కాదు లే. అయినా ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒకే ఒక్క రాత్రి చాలులే జీవితం మలుపులోకి పోవటానికి. అసలు ఏ పని పాడూ లేకుండా ఆడుతూ పాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలాగే ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటే కాళ్ళు నొప్పులు, గొంతు నొప్పులు వస్తాయి. మరి ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా ఉన్నా గాని కాసేపు ఖాళీ దొరికితే ఆలోచనలోకి నవ్వు రావాలి, రాత్రి మంచం ఎక్కగానే మంచి నిద్ర రావాలి. అలా ఉన్నప్పుడే కదా మనసుకి హాయిగా ఉండేది.


ఇప్పుడున్న రోజుల్లో అందరూ ఏదో ఒక బాధలో ఉన్నవారే. కానీ అందరి బాధల్లో అధికంగా ఉన్న కామన్ పాయింట్ ఏంటో నేను చెప్పనా. అదేంటి అంటే వారి బాధ అసలు అసలైన బాధ కాదు. అంటే స్వతహాగా అది బాధే కాదు. అలాంటి ఒక బాధని ఎవరికి వారే కల్పించుకున్నారు. ఎందుకు అంటే అది వారి బలహీనత. అసలు ఏ బాధ లేకుండా మనిషి ఉండగలడా అంటే నేను యెస్ అనే చెప్తాను. ఎలా అంటే మాత్రం అందరికీ అర్ధం అయ్యేలా చెప్పలేను.

ఎవరి బాధలు వాళ్ళు ఒక్కొక్కటిగా చెప్తే అపుడు చెప్పగలను, వాటికి రెమెడీలు కూడా రెడీమేడ్ గా ఇవ్వగలను. కానీ ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటి అంటే నేనిచ్చే పరిష్కారాలతో మీ సమస్యల్ని మీరు పోగొట్టడానికి ఇష్టపడరు. దానికి కారణం మీలో ఉన్న మరో బలహీనత. అదే ఇగో. నేను ఇచ్చిన ఐడియా ఎందుకు ఫాలో అవ్వాలి అనే ఇగో. నా సొల్యూషన్ కంటే మీ సమస్యే గొప్పదని మీ ఫీలింగ్. ఎందుకు అంటే సమస్య మీది సమాధానం నాది అనే మీ పొగరే దానికి కారణం. ఇప్పుడు కాసేపు మీ ఇగో ని పక్కకి పెట్టి సమస్య తో పాటు సహాయం కూడా మీరే ఇచ్చుకోండి. అది ఎంత చెత్తగా ఉన్నా మీకు నచ్చేస్తుంది. అదే కదా అసలు సమస్య.



పాయింట్ టు బి నోటేడ్. అందరికి ఉన్న ఒకే సమస్య ఇగో. దానికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం లాంటి నానార్ధాలు చెప్పి నిన్ను నువ్వే మోసం చేసుకోకు గురూ. నీది నాది ఒకే కథ. కదా...!


ఈ ఒక్క ముక్క అర్ధం చేసుకుంటే నీకే కాదు, నాకు కూడా ఉన్న సమస్యలు అన్ని సులువుగా పోతాయి. అన్ని ప్రశ్నలకి సమాధానం లేకపోవచ్చు కానీ అన్ని సమస్యలకి సొల్యూషన్ ఉంటుంది. కానీ మనకి నచ్చక కొన్నిటిని పట్టించుకోము. అంతే.


అందరూ కొన్ని జరగాలి అనుకుంటారు. అలా జరగకపోతే అంతా పోయినట్టు ఏడుస్తారు. దానికంటే ఎలా జరగాలో ముందే అనుకోవటం మానేస్తే బెటర్ అనే సొల్యూషన్ ని పట్టించుకోకుండా ఇంకేదో జరగాలి అని కోరుకుంటారు. దీన్నే తప్పు మీద తప్పు చేయటం అంటారు. ఇగో కి పోయి మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు. ఏం జరిగినా చివరికి ఏడవను అనుకున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుద్ది. కానీ అది జరిగే పని కాదుగా. వద్దన్నవి తిన్నప్పుడు వచ్చే వాంతుని తన వంతు వచ్చినప్పుడు వచ్చే ఏడుపుని ఎలా ఆపుతావ్?


ఏ ఆలోచన లేకుండా బ్రతకగలిగినప్పుడు గానీ లేదా ఏ ఆలోచన వచ్చినా అలాగే వదిలేయగలిగినప్పుడు గాని ఆ ఆలోచన చేసే మనసుకి కలిగే హాయి అంతా ఇంతా కాదు తెలుసా? మంచి చెడుతో సంబంధం లేకుండా ఏ అలవాటు లేని అంటే ఎలాంటి ఎడిక్షన్ లేని జీవి ఉంటే అదే అన్నిటి కంటే చిరంజీవి. అది తినాలి, ఇది కొనాలి, అది తెయ్యాలి ఇది కొయ్యాలి, అటు పోవాలి, ఇటు కావాలి లాంటి ఆబ్లిగేషన్ లు గొంతెమ్మ కోరికలు లేని జీవితం ఎవరికి ఉంటుంది? కానీ అలా ఉంటే అదే అందమైన జీవితం. కాదు ఆనందమైన జీవితం. ఆనందం అనేది అది పొందే మనసుయొక్క పరిపక్వత మీదే ఆధారపడి ఉంటుంది.


ఎప్పుడూ గెలవాలి అని అనుకుంటే ఓడిపోయినప్పుడు వచ్చే బాధని తట్టుకోవటం కష్టం అవుతుంది. గెలుపు అనేది ఊపుని ఇవ్వాలి కానీ అదే ఊపిరి అనిపించే ఊహని ఇవ్వకూడదు. ఒకడిని నువ్వు శత్రువుగా భావించినప్పుడే కదా వాడు గెలిచాడు నువ్వు ఒడిపోయావ్ అని అనిపిస్తుంది? ఆలోచిస్తే అతిశయమే అన్నారు. మనకున్న సమస్య ఏదైనా అవొచ్చు దానికి ఆ సమస్య కూడా ఊహించని పరిష్కారం ఉంటుంది. Just dare to accept it. నా దృష్టిలో నీకు నాకు ఉన్న ఒకే సమస్య ఇదే, ఒకడు చెప్తే ఒప్పుకోకపోవటం.


నువ్వు చెప్తే నేను ఒప్పుకుంటా, నేను చెప్పినప్పుడు నువ్ కూడా ఒప్పుకో. పోనీ కనీసం తప్పుకో. కానీ తప్పు అని వాదించి సమస్యని పెద్దది చేసుకోకు.


-ఎక్స్.

No comments:

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...