Friday, September 17, 2021

Lost in Past

B032 dated at Pedamynavanilanka the 17.09.T21


కొన్ని వస్తువుల్ని చూస్తే వాటికి ప్రాణం పోసి మాట్లాడాలి అనిపిస్తుంది. మన కంటే ముందు నుంచీ మన ఇంట్లో ఉంటూ కిక్కురుమనకుండా మనకు మించి మన ఇంటికి ఉపయోగపడుతూ వాటితో మనకున్న బంధాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో కొన్ని ప్రదేశాలతో మనకి ఉండే ఆ అనుసంధానం కూడా అలాగే ఉంటుంది. అప్పట్లో మనం అన్నం తిన్న కంచం, చిన్నగా ఉన్నప్పుడు మనం కూర్చున్న చిన్న పీట, ముందు తరం నుంచే మనల్ని అలరిస్తూ వచ్చిన రేడియో, ఆ పై వచ్చిన టేప్ రికార్డర్, మనం కోసమే నాన్న కొన్న వాక్ మాన్ ఇలాంటివన్నీ ఇపుడు మన ఇంట్లో ఓ మూలన ఏ పనీ చెయ్యకుండా ఉసూరుమని పడుంటే ఒకప్పుడు వాటితో ఉన్న జ్ఞాపకాలు మరింత మధురంగా కనిపించటమే కాకుండా ఒకింత బాధగా కూడా అనిపిస్తాయి. మన చిన్నప్పుడు మనం కూర్చున్న మడత మంచం మీద ఇపుడు మన పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు ఆ మంచానికి మనసుంటే ఎంత గర్విస్తుందో అనిపించే ఆ ఆలోచన అదోరకం. వాక్ మాన్. ఈ మాటకే నాకు ఎప్పుడూ ఒకటి గుర్తొస్తుంది. 2002 కి కాస్త ముందు అనుకుంటా, తెలిసిన వాళ్ళు ఎవరో వాక్ మాన్ తెచ్చి మా ఇంట్లో పెట్టి తర్వాత తీసుకెళ్లిపోయారు. అలాంటి దానిపై మనసు పడ్డ నేను ఒకటి కొనమని మా ఇంట్లో అడిగాను. ఎలా అడిగాను అంటే ఇప్పుడు నా కూతురు తన నోట్లోంచి మాట వస్తే వదలకుండా ఎలా అడుగుతుందో అలా. నా కూతురుకి నా దగ్గర ఉన్న చనువు అప్పట్లో మా నాన్న దగ్గర నాకు లేదు కాబట్టి గట్టిగా అడగలేకపోయినా ఇంట్లో మిగిలిన వాళ్లకి అర్ధం అయ్యేది. రెపల్లెలో రాధ అనే సినిమా పాట ని లిరిక్ మార్చి వాక్ మాన్ కొనమని పాడే వాడిని. మొత్తానికి కొన్నారు. 160 రూపాయలు అన్నట్టు గుర్తు. మైమరచి చెవిలో పెట్టుకుని పాటలు వినేవాడిని. తర్వాత కాస్త అటు ఇటు అయ్యి సరిగా పనిచెయ్యకపోతే మరమ్మత్తులు చేసి వాడుకుంటుండగా 2008 లో హాస్టల్ ఖాళీ చేసేటప్పుడు మా క్లాస్ మేట్ కిరణ్ గాడు నా దగ్గర నుంచి అది తన రూమ్ కి తీసుకెళ్లి అది ఒక పనికి రానిది అనుకుని నా దగ్గరకు వచ్చి నా కళ్ళ ముందే నేలకేసి కొట్టాడు. గుండె పగిలినంత పనయ్యింది నాకు. ఒక ఆంటిక్ పీస్ లా చూసుకున్న నా వాక్ మాన్ ని పగలకొట్టిన వాడిని కొట్టాలనిపించింది కానీ ఏం చెయ్యలేకపోయాను. ఇలాగే క్రికెట్ బ్యాట్ కూడా కొనిపించుకున్నాను చిన్నప్పుడు. హీరో హోండా స్టిక్కర్ తో ఉన్న ఆ బ్యాట్ 120 రూపాయలు. అది హ్యాండిల్ విరిగిపోతే ఫెవికాల్ తో అతికించుకుని దాని మీద పెయింట్ వేసుకుని నచ్చిన పేరు రాసుకొని వాడుకున్నాను. కాదు ఆడుకున్నాను. అది ఇప్పుడు లేదు లే ఏమైందో మరి. రేడియో, హీరోయిన్ సౌందర్య చనిపోయిందని అందులో విన్న వార్త, టీవీ లో టెలికాస్ట్ ఇవ్వని కొన్ని క్రికెట్ మ్యాచ్ ల కామెంటరీ. అలాగే తర్వాత వచ్చిన సీడీ ప్లేయర్ తో అంత అనుబంధం లేదు కానీ ముందు ఉన్న టేప్ రికార్డర్, అందులో వేసిన క్యాసెట్లు, పని చేసుకుంటూనే విన్న పాటలు, సినిమా కథలు, అది ఆగినప్పుడు వచ్చే జింగిల్ బెల్ మ్యూజిక్ ఇవేమీ మర్చిపోయేవి కాదు. ఇలా పాత వస్తువుల్ని వాటి జ్ఞాపకాల్ని కోకొల్లలుగా దాచుకున్న నేను 2009 లో లాప్టాప్ కొన్నాక 2007 నుంచి మార్చి మార్చి వాడుతున్న ఫోన్ల లోని sms లని కూడా laptop లో జ్ఞాపకాలుగా దాచుకునే వాడిని. కానీ తర్వాత వాటిని కూడా గుర్తు తెలియకూడదనుకున్న వాడొకడు డిలీట్ చేసాడు. ఇలా దాచుకున్నవి పోగొట్టుకున్నప్పుడు వచ్చే బాధ వెంటనే పోదు అనిపిస్తుంది కానీ ఇలా దాదాపు అన్నీ పోగొట్టుకుంటుంటే అదే అలవాటు అవుతుంది.

ఇందాక రేడియో నుంచి లాప్టాప్ వరకు వచ్చాం కానీ మధ్యలో ఒకటి మర్చిపోయాం. శుక్రవారం రాత్రి ఏడున్నర కి వచ్చే సినిమా పాటలు చూడటానికి పక్క వీధిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం నుంచి, సాయంత్రం బడి అవ్వగానే మొదలు పెట్టి రాత్రి ఏడు అవ్వగానే 15 నిమిషాల ఖబరే తో కలిపి అరగంట వార్తలు రావటంతో అది చూడటం ఎదో పాపం అన్నట్టు ఇంటికి వచ్చేయటం, తర్వాత మా నాన్న కొత్త టీవీ కొని దాన్ని చెక్ చేయటం కోసం భుజాన వేసుకుని మా పెదనాన్న ఇంటికి నడిచి వెళ్ళటం, నేను కూడా వెనకే వెళ్లి అన్నీ చూసి రావటం, అది సరిగా రాని సమయంలో ఇల్లు ఎక్కి ఏంటెనా తిప్పటం, కేబుల్ కనెక్షన్ ఇచ్చాక ఫైబర్ వయర్ తో ప్రయోగం చెయ్యటం, ఒకసారి స్టబిలైజర్ షాక్ కొట్టడం, మా అన్న వాళ్ళ ఇంట్లో టీవీ వెనక పిన్ పోతే దాన్ని కొనటానికి ఇద్దరం కలిసి పది రూపాయలు తీసుకుని ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కి వెళ్ళటం, బ్లాక్-వైట్ టీవీకి కలర్ గ్లాస్ పెట్టి చూడటం, తర్వాత పెద్ద సైజ్ కలర్ టీవీని సెకండ్ హాండ్ లో కొనటం, ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ మరమ్మత్తులు చేయించి అదే టీవీ మా ఇంట్లో వాడుతూ ఉండటం వరకు ఇవన్నీ ఎలా మర్చిపోతాను. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళెవరికి ఇవన్నీ గుర్తు ఉండవు కానీ నాకు? ఇప్పుడు యూట్యూబ్, గూగుల్ కూడా గుర్తు పట్టని, అవి చేసిన వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోని కొన్ని టీవీ షో లు నాకు గుర్తు ఉన్నాయి.  

ఇక విషయంలోకి వస్తే నాకు డైరీగా ఉపయోగపడుతూ ఆరున్నర సంవత్సరాలుగా గతంలో ఎప్పుడు ఏం జరిగిందో ఇట్టే చెప్పగలిగే అందమైన అనుభూతులు దాక్కున్న నా వాట్సాప్ మెసేజెస్ అన్నీ కేవలం నా చిన్నపాటి పొరపాటు, అందులో నా తొందరపాటు వల్ల పోయాయి. మళ్ళీ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయాయి. బాధ పడటం, move on అనే వాళ్ళు ఇచ్చిన సలహాను పాటించటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. గూగుల్ ఫొటోస్ లో అయితే మూడు అకౌంట్లు నిండిన జ్ఞాపకాలు ఉన్నాయి. అవైనా పోకుండా కాపలా కాస్తుండాలేమో. 


జ్ఞాపకాల విలువ తెలిసిన చాలా మందికి నాలాగే అనిపిస్తుంది. భద్రంగా దాచుకున్న వాళ్ళ పెళ్లి ఫోటోలు, ముద్దొచ్చే వాళ్ళ పిల్లల ఫోటోలు కేవలం చిన్న చిన్న అజాగ్రత్త వల్ల చేజారిపోతే ఎంత బాధ పడతారో నేను చూసాను. ఒక ఫ్రెండ్ అయితే తన కొడుకు ఫోటోలు ఉన్న మెమరీ కార్డ్ కరప్ట్ అయితే దాన్ని రిపేర్ చేయటానికి లక్ష ఖర్చు అయినా పర్వాలేదు అన్నది.


అదే ఫ్రెండ్ మా ఇంట్లో పాడైన పాత టేప్ రికార్డర్ ఉందని చూపిప్తే నాకు అలాంటివి ఇష్టం ఇచ్చేస్తావా అన్నది. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు అనిపిస్తుంది నా లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని. 


ఇప్పుడు కూడా మూలబడి ఉన్న కొన్నింటి దుమ్ము దులిపితే ఎన్నో మంచి జ్ఞాపకాలు కొన్ని రోజులుపాటు వెంటాడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చెయ్యలేని వాటిని ఒకప్పుడు ఉద్ధరించాం అనటానికి ఆనవాళ్లే ఈ అనుభవాల్ని పంచే జ్ఞాపకాలు. నేను ఎంతమందికి గుర్తు ఉంటానో తెలియదు కానీ నా ప్రతి నిన్నలో నాకున్న జ్ఞాపకాలను బట్టి వాటిని పంచిన ప్రతీవాళ్ళు నాకు గుర్తు ఉంటారు. 


ఏది ఏమైనా పోతే తిరిగిరావు అనే వాటి విషయమై కనీస బాధ్యత లేకపోతే కన్నీరే మిగులుతుంది. వ్యక్తులైనా వస్తువులైనా.



-eckce

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...