Wednesday, January 27, 2021

Childhood Friend

B015 dated at Tadepalligudem the 27.01.T21


కుర్రతనం లో ఉండే ధైర్యం కొంచెం వయసొచ్చాక ఉండదు. ఆలోచనలు ఎక్కువయ్యో భయం ఎక్కువయ్యో ఏం చెయ్యాలన్నా వెనకడుగేస్తాం. చాలా సందర్భాల్లో అలా ఆగి ఆలోచించటం మంచిదే అవుతుందిలే. అందులోనూ వయసొచ్చాక కూడా అదే ధైర్యంతో ఏది పడితే అది చేసేస్తే నలుగురూ ఐదారు రకాలుగా అనుకుంటారనే భయం కూడా ఉంటుంది మరి.


నా చిన్నప్పుడు మా నాన్నగారి వ్యాపార స్నేహితుడి కొడుకు మా ఊరిలో వేరే పని కోసం కొన్నాళ్ళు ఉండగా మేము అతనితో బాగా క్లోజ్ అయ్యాము. మేము అన్నయ్య అని పిలిచే వాళ్ళం. మా ఇంట్లోనే భోజనం చేసేవాడు. అబ్బాయిని కాబట్టి నేను ఇంకా బాగా అతనికి దగ్గర అయ్యాను. ఎలా అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు. నేనంతే నచ్చితే బాగా కనెక్ట్ అయిపోతా. అది వేసవి కాలం కావటంతో ఉదయం బడి అవ్వగానే బువ్వ తినేసి అతని దగ్గరకి వెళ్ళిపోయే వాడిని. సాయంత్రం వరకు అతనితో ఉండే వాడిని. అలా కొంత కాలం తర్వాత అతను వచ్చిన పని అయిపోవటంతో వాళ్ళ ఊరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి ఏడాది సంక్రాంతి కి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. మా నాన్న గారు నన్ను అక్కడ దిగబెట్టారు. నన్ను సైకిల్ మీద ఊర్లో కాసేపు తిప్పాడు. అక్కడే ఆదివారం రాత్రి జెమినీ టీవీ లో వన్స్ మోర్ ప్లీజ్ షో, అమృతం సీరియల్, సిటీ కేబుల్ లో నువ్వు-నేను సినిమా చూసి నిద్రపోయిన రోజు ఇంకా గుర్తు ఉంది. తర్వాతి రోజు అనుకుంటఎగ్జిబిషన్ కి కూడా పక్కనే ఉన్న పట్నం తీసుకెళ్లాడు. అతనికి ఇద్దరు చెల్లెళ్ళు. నాకు అక్కలు అన్నమాట. అది 2002 సంవత్సరం. అప్పటికే మూడు కొత్త సినిమాలు వచ్చాయి. మా ఫ్రెండ్ వాళ్ళ పక్కింటి ఆంటీలు చిరంజీవి డాడీ సినిమాకు వెళ్తే నేను,అతను మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి వెళ్లాం. మా వాడు వెంకటేష్ కి వీరాభిమాని. టక్కరి దొంగ సినిమా కథ వాళ్ల కజిన్ మాకు చెప్తే విన్నాం. వాళ్ళు అక్కడ పెట్టిన భోజనం, అందులోనూ నేను మొహమాటంగా మొదటిసారి రుచి చూసిన చేదు పచ్చి పులుసు, వాళ్లు చేసే పిండి వంటలు, స్వీట్లు (అదే వాళ్ళ వ్యాపారం) ఇవన్నీ తీపి జ్ఞాపకాలు. అయితే ఒక విషాదం కూడా జరిగింది. ఒకరోజు ఉదయమే వాళ్ల నాన్నగారు నన్ను పక్కనే ఉన్న పట్నం వెళ్దాం అని ఆయన వాడే మోపెడ్ మీద తీసుకెళ్తూ ఉన్నారు. ఎదురుగా వస్తున్న ఒక బండి డాష్ ఇవ్వటంతో ఆయన కాలికి బలమైన దెబ్బ తగిలింది. అక్కడ కాసేపు గొడవల తర్వాత ప్రధమ వైద్యం కోసం క్లినిక్ కి వెళ్లిన మాకు ఆయనకి తెలిసిన అతను కనిపించాడు. బహుశా ఆయనే అతన్ని అక్కడికి పిలిపించారు అనుకుంటా. ఆయన అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఇతనితో నన్ను బయటకి పంపించారు. అప్పుడు తెలిసింది అసలు నన్ను ఎందుకు ఉదయమే బయటకి తీసుకెళ్లారా అని. నాకు కొత్త బట్టలు కొన్నారు. అప్పుడు నాకు అయ్యో నాకు బట్టలు కొనటానికి వచ్చి ఇలా దెబ్బ తగిలించుకున్నారా అనిపించింది. కానీ నాకు బాగా మొహమాటం కదా. అనుకున్నవి ఏవీ బయటకు చెప్పలేకపోయా.


అలా అక్కడే ఆ పండగ ప్రతిసారి లా కాకుండా కొంచెం వేరేలా గడిపాను. ఆ నాలుగు రోజులు అయ్యాక మా నాన్న గారు వచ్చి నన్ను మా ఇంటికి తీసుకొచ్చేశారు. నేను వేసుకున్న ఆ కొత్త బట్టల్ని చూసి మా అక్క ఆ అన్నయ్య బట్టలు నాకు ఇచ్చాడు అనుకుంది. అవే కొత్త బట్టలు నేను స్కూల్ కి వేసుకెళ్తే స్కూల్ యూనిఫామ్ వేస్కురాలేదని మా క్లాస్ లీడర్ గాడు నా చేత వంద గుంజీలు తీయించాడు, నేను కూడా గుల ఎక్కువై తీసేసాను. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి మా ఇంటి ముందున్న డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆయన అడిగారు, నిజం చెప్పు అసలు ఏమైంది అని. హ్మ్.



ఏదైనా కొత్త అనుభవం మనకి నచ్చితే మళ్ళీ అదే కావాలి అనిపిస్తుంది కదా. ఎంత తొందరగా మళ్ళీ అనుభావిస్తామా అని ఆత్రంగా ఉంటుంది. ఇది అందరకీ అన్ని విషయాల్లోనూ ఉంటుంది.  అదే నాకు అనిపించింది నా ఫ్రెండు ని చూడాలి అని. అప్పుడే నాకు కొత్త సైకిల్ కొన్నారేమో ఒక ఆదివారం మా నాన్న గారు ఇంట్లో లేనప్పుడు మా అమ్మ బిజీగా ఉన్నప్పుడు నేను రెడీ అయిపోయి నా హెర్క్యూలుస్ MTB సైకిల్ వేసుకుని బయలుదేరా. దానికి ముందు ఒక పని చేసాను. ఒక చిన్న కాగితంలో 'అమ్మా, నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేస్తాను, కంగారు పడవద్దు' అని రాసి మా అమ్మకి కనిపించేలా ఫ్రిడ్జ్ మీద పెట్టాను. అనుకున్నట్టుగానే వెళ్లి వాళ్ళతో గడిపి సాయంత్రానికి వచ్చేసా. ఆ రోజు సాయంత్రం మా అమ్మ మా నాన్న గారితో చిన్నోడు భ్రమ తిరిగిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అని ఆశ్చర్యంగా చెప్పటం నేను విన్నాను. కానీ నాకు ఇప్పటికీ తెలియని విషయం మా అమ్మ నేను రాసింది అసలు చదివిందా లేదా? నేను అంత సినిమాటిక్ గా ఎలా అలా చెయ్యగలిగానో? అప్పటికి మా ఇంట్లో కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు అని గుర్తు.


తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు, వాళ్ళ గృహ ప్రవేశానికి కూడా వెళ్ళాను. 2003 లో మహా శివరాత్రి కి అక్కడికి మళ్ళీ వెళ్ళాను. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ రెండో సగం అక్కడే చూసా. పగలు అన్వర్ 101 చూడలేదు కానీ సచిన్ 98 చూసా. తర్వాతి రోజు పేపర్ లో పాక్ కు కాళరాత్రి భారత్ కు శివరాత్రి అని పేపర్ లో చూసా. 23 మార్చ్ న ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే చూడటానికి మా నాన్న గారితో కలిసి వెళ్ళాను కానీ వాళ్ళు ఇంటి దగ్గర లేకపోవడంతో మేము పట్నం వెళ్లి ఇంటికి వచ్చేసాము. ఆ రోజు మా ఊర్లో ఉన్న క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదటి సగం అయ్యాక సాయంత్రం మనోళ్లు కొడతారా లేదా అని భయపడుతూ రోడ్ మీద నడుస్తూ మాట్లాడుకోవడం నేను మర్చిపోను. నా ఫ్రెండ్ ని మళ్ళీ కలిసే అవకాశం 2004 డిసెంబరు లో వచ్చింది. 26వ తేదీన సముద్రం మా ఊరు మీదికి వచ్చేస్తుంది అని భయంతో పనికి వెళ్లిన వాళ్ళు బోరున ఏడుస్తూ తిరిగి రావటం బ్రష్ చేస్తున్న నేను చూసి ఇంట్రస్టింగ్ గా చూసాను.  ఊరు విడిచి వెళ్ళిపొమ్మని వచ్చిన హెచ్చరికలతో బెడ్ రెస్ట్ లో ఉన్న మా అక్క తో సహా మేము మా ఫ్రెండ్ ఇంటికే వెళ్ళాము. తర్వాతి రోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాము. దాన్నే తర్వాత సునామి అన్నారు. ఆ పదం అప్పట్లో మీ అందరికి కొత్త కావచ్చు. కానీ అంతకు ముందు ఏడాదే సోషల్ బుక్ లో నేను సునామి తరంగాల గురించి చదివాను. నేను పదో తరగతి వీడ్కోలు పుస్తకాల్లో (ఫ్రెండ్ స్లామ్ బుక్స్) నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే అతని పేరే రాసాను. తర్వాత నేను కాలేజ్ కి వెళ్ళేటప్పుడు దారిలో మా ఫ్రెండ్ ఇంటి పక్క నుంచే రోజుకి 32 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన రోజులు కొన్ని ఉన్నాయి.



ఇవి నా ఫ్రెండ్ సంగతులు. అతను కూడా నా లాగే మోహమాటస్తుడు. కొంచెం మిత భాషి. కొన్ని ప్రత్యేక లక్షణాలు అయితే అతనిలో ఉన్నాయి. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ నాకు టచ్ లో ఉన్నాడు. కానీ అప్పట్లా అయితే అసలు కాదు. దానికి కారణం పెరుగుతున్న వయసు, చుట్టూ ఉన్న పరిస్థితులు. కానీ ప్రతి జనవరి 7న నేను విష్ చేస్తాను. ఎప్పుడైనా అతను కాల్ చేస్తాడు. అందుకే చెప్పా కుర్రతనపు అనుభూతులే వేరు.



-ecKce

2 comments:

mohantangella said...

Happy birthday to your sweet friend..

Ananth said...

Remember my childhood days..From this story...

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...