B020 dated at Tadepalligudem the 04.03.T21
గతేడాది ఫిబ్రవరిలో ఒక కస్టమర్ సర్జికల్ మాస్క్ లో రావటం చూసి ఏంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు అని ఆఫీస్ లో కొలీగ్స్ తో జోకులేసుకున్నాను. ఆ కస్టమర్ ని అడిగేసా కూడా అంత అవసరమా అని. ఎందుకైనా మంచిది కదా అని అన్నాడు. అలాంటిది ఈ రోజుకి కూడా మాస్క్ వేసుకునే బయటకి వెళ్లడం అలవాటుగా మారింది అందరికీ.
మార్చ్ 4కి సరిగ్గా సంవత్సరం పూర్తి అయింది, AP తెలంగాణ మొత్తం వణికిన రోజు ఇది. మన పక్కకి కూడా రాదు అనుకున్నది మన పక్క వరకు వచ్చేసింది అనగానే అందరూ భయంతో మాట్లాడుకున్న రోజు అది. నేను exam రాయటానికి ఊరెళ్తే వాట్సాప్ గ్రూప్ లో డిస్కషన్ జరుగుతుంది. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్ లోకి వచ్చింది అని emlpoyees ని ఇంటికి పంపేశారు అని. మధ్యాహ్నానికి కాకినాడ హాస్పిటల్ లో ఒక ఫారిన్ రిటర్న్ కి వచ్చింది అని టీవీ లో ఫ్లాష్ న్యూస్ కూడా రావటం చూసా. ఇదిలా ఉంటే ఇంకా కొన్ని అసత్య వార్తలు కూడా వ్యాపించాయి. కానీ అప్పటికి అవి నమ్మేసామందరం. కానీ అక్కడ ఇన్ని ఇక్కడ ఇన్ని అంట అని చెప్పుకోవడం తో మొదలైన హడావిడి న్యూస్ ఛానెళ్ళకి మంచి ఐటెమ్ గా మారింది. మెల్లగా దేశం మేల్కోవటం, ఆరిందాలు ఆక్షేపించటం, నెటిజన్లు జోకులు వేయటం, ఆయుర్వేద ఆరోగ్య వేత్తలు ఆసరాగా తీసుకుని జాగ్రత్తలు చెప్పటం, జ్యోతిష్యులు జాతకాలు బాలేదని చెప్పటం, మతస్తులు చరిత్ర ముందే చెప్పిందని కల్పనలు చెయ్యటం, ఇలా ఎక్కువ మోతాదులో అబద్దాలు చక్కర్లు కొడుతున్న సమయంలో దేశమంతా కలిసి పోరాడితేనే గాని ఈ చేదు నుంచి తేనెను పొందలేమని పెద్దల సమక్షంలో దేశ పెద్ద నిర్ణయించట దాన్ని అందరూ మెచ్చుకోవటం, దానికి మద్ధతివ్వటం అదే రోజు అధిక సంఖ్యలో బాధితులు బయట పడటం అన్ని 20 రోజుల్లో జరిగిపోయాయి.
పద్నాలుగు గంటలు దేశం మొత్తం మూసుకుని ఇంట్లో కూర్చున్న రోజును అందరు పండగ లా చేసుకున్నారు. గడువు పూర్తి కాగానే జైలు నుంచి విడుదల అయినట్టు కొందరు సంబరాలు జరుపుకున్నారు. కానీ కేవలం ఒక్కరోజుకే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఏడో ఎక్కం చదివినట్టు 14 రోజులు, 21 రోజులు అంటూ గృహ నిర్బంధ చట్టానికి చుట్టాలయ్యాం. మంచి అయినా చెడు అయినా పంచటానికి అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా వల్ల చాలామంది జగురూకత రీత్యా లాభపడ్డారనే చెప్తాను. అయితే భయభ్రాంతులకు గురి చేసిన ఘనత కూడా దానికే ఉందిలే. కానీ చాలా ఎక్కువ విషయాల్ని ప్రజలకి తెలియచేసిన రోజులవి. నాకు shut up తెలుసు shut down తెలుసు, lock up తెలుసు. ఇవన్నీ కలిపిన పదం వేరే అప్పుడే విన్నాను. ఇది కాలం నేర్పిన పదం. 2004 లో tsunami అనే పదాన్ని నేర్చుకున్న జనం పదిహేనేళ్ల తర్వాత lockdown, quarantine లాంటి ఎన్నో పదాల్ని అలవాటు కూడా చేసుకుని వాడేస్తున్నారు. ఎంతో మందికి నష్టం, కొంత మందికి లాభం, అందరికి భయం, స్తంభించినవి కొన్ని, ఆగిపోయినవి కొన్ని, మెచ్చుకోవాల్సిన వాళ్ళు ఎందరో ఇలా 14, 21,15 రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత ప్రమాదంగానే మారింది గాని ఫలితం మాత్రం కనిపించలేదు. కొవ్వొత్తుల వెలుగులు, చప్పట్ల బెదిరింపులు, తపేలాల చప్పుళ్ళు తమాషాకి చేసినట్టే ఉన్నాయి సమాధానం ఇవ్వలేదు. ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఈ దుస్థితి ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడగా, అన్నీ ఉన్నవాళ్లు ఇదే బాగుంది కొనసాగాలి అని కోరుకున్నారు, ఈ సమయంలో వాళ్ళు ఇలా చెయ్యాలి, వీళ్ళు ఇలా చెయ్యాలి అని కొందరు విమర్శించటం చేస్తుండగా ఎంతో సృజనాత్మకతను బయటకి చూపించే అవకాశం, అది చూసే సమయం జనాలని దక్కింది. దుయ్యబట్టే లక్షణం ఉన్న వాళ్ళకి కుడా మంచి సందర్భాలే వరించాయి. 2016 నవంబర్ లో రెండు వారాలు, ఇప్పుడు 24 వారాలు. కొందరు వారి ఉదారత్వాన్ని బయటకి చూపిస్తే కొందరు వారికి ఉన్నది వాళ్ళు చూపించి ప్రజల్ని అలరించటానికి ప్రయత్నించారు. ప్రభుత్వం మాత్రం యువతని కట్టడి చేసే ప్రయత్నాలు మెల్లగా ముమ్మరం చేసి వారికి వ్యసనాలుగా భావిస్తూ కొన్నిటిని తక్షణ రక్షణ కోసం బహిష్కరించింది. సమయం సరదాగా నడుస్తుంది అనుకున్న వాళ్ళకి సరదా తీర్చింది. మనతో తిరిగిన వాళ్ళని కూడా కాలం బలి తీసుకున్న రోజుల్ని దాటుకొని ఈ రోజుకి ఇలా ఉన్నాం. నేను కూడా భయపడిన సందర్భాలు రెండు ఉన్నాయి కానీ నేను నా ఇంట్లో ఎవరూ దీని బారిన పడకుండా, కనీసం పరీక్ష వరకు కూడా పోకుండా దేవుడు రక్షించాడు. కానీ కోల్పోయిన కొన్ని జీవితాలకు మనం అందరూ సాక్షులం. ప్రమాదాన్ని దాటుకుని వచ్చిన ఎందరితోనో ఇప్పుడు మనం కలిసే ఉంటున్నాం. చాప కింద నీరులా అనుకూల పరిస్థితులు మన అదుపులోకి వచ్చాయి. మొదటి ఆరునెలలు వణికించి తర్వాత ఆరునెలలు unlock అంటూ ఎలా జరిగిపోయింది అనేది మిస్టరీ. కానీ మళ్ళీ మాస్క్ లకి గిరాకీ పెరిగే పరిస్థితులు రాకుండా ఈ ఏడాది అనుభవాల్ని జాగ్రత్తలుగా పాటించాలి.
ఎన్నో మంచి అనుభవాలు మిగిలిపోయాయి. నా జీవితంలో గడిచిన అతి వింత సమయం ఈ 12 నెలలు. చేదైనా బాధైనా ఇదే నిజం. కొందరికి సానుకూలంగా కొందరికి ప్రతికూలంగా గడిచిన ఈ మహమ్మారి మాయాజాల కాలం మళ్ళీ తిరిగిరాదు. నిజానికి రాకూడదు.
-ఎక్స్.
1 comment:
Excellent story about lockdown period i have ever reaf
Post a Comment