B029 dated at Tadepalligudem the 26.07.T21
చుట్టూ ఏదో జరుగుతున్నట్టు తెలుస్తున్నా స్వచ్ఛమైన స్పష్టత లేదు. కప్పుకున్న పొరలతో కళ్ళు బైర్లు కమ్ముకుని ఏదీ ఆరా తియ్యలేకపోతున్నాయి. జరిగేదేదో జరిగింది మనకెందుకు అనుకునే పరిస్థితి లేదు. జరుగుతున్నవన్నీ ప్రతికూలంగానే ఉన్నట్టు ప్రత్యక్షం అవుతున్నా ఆపటానికి ఏం చెయ్యాలో తోచట్లేదు. మొదలు పెట్టిన పని ఏది పూర్తి చెయ్యలేకపోయేంత పరధ్యానంలో ఉంటున్నా. ఆగిపోయిన ఆలోచనలు, వాయిదాలో ఉన్న పనులు, ఇంకా ఎన్నో అశ్రద్దపాలు. ఈ దుష్ప్రభావాలను గుర్తించకుండానే రోజులు వాటికవే గడిచిపోతున్నాయి. చేస్తున్నది ఏదీ ఉపయోగపడేది కాదు. చెయ్యమని మనసు ప్రలోభపెట్టట్లేదు, అలాగని ఆపట్లేదు. వ్యాసనాలకలవాటు పడిన మనసు అసలైనవి మర్చిపోయింది. ఈ అనుభవాలను నేను గుర్తించటానికే చాలా సమయం పట్టింది. చాలా కోల్పోవాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో ఇదే తీరుగా ఉన్నాను. తేరుకోవాలి అనుకున్నా ఇప్పటికీ అలాగే ఉంటున్నాను.
నేనిలా ఉంటున్నా అని ఆలోచిస్తే గాని నేనెలా ఉంటున్నానో తెలియట్లేదు. నేనిలా ఎందుకున్నా అని తలుచుకునేంత తీరిక లేదు, అలాగని చేస్తున్న పని ఏంటనే ధ్యాస లేదు.
నాకైతే ఇప్పుడు తెలిసింది. కానీ చాలామందికి ఎప్పటికీ తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను మాత్రమే మనిషి కాదు. ఇలాంటి స్థితిలో అందరూ ఎప్పుడోకప్పుడు, లేక ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు. కానీ వారు ఉన్న మత్తు గురించి వారికి కూడా తెలియదు. ఉన్నవి కోల్పోయాక కూడా తెలియదు. ఎందుకంటే మన అందరి కన్నులకి కొన్ని పొరలు తెరలుగా పనిచేస్తూ అసలు మనం ఏం చెయ్యాలి అనేది తెలుసుకోకుండా చేస్తాయి. నేను ఇలా ఉంటున్నది గత కొన్ని నెలలుగా మాత్రమే. కొంతమంది అయితే కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండేవారు ఉంటారు. ఒకవేళ నేను కూడా అదే జాబితాలోకి రావొచ్చు కూడా.
మనలని సరిచేయాలి అని ప్రయత్నించేవాళ్ళు కూడా మనకి శత్రువుల్లా కనిపించే గత్యంతర స్థితిలో మనం ఉంటాం. కానీ వింతగా మిగిలిన వాళ్ళని సరిచేసేయ్యాలి అనుకుంటాం. ఉదాహరణకు నాకు రాయటం అంటే ఇష్టం కానీ చదవటం కాస్త కష్టం. కొంతమంది చెప్పమంటే ఆపకుండా చెప్పగలరు కానీ ఓపిగ్గా వినలేరు. పైగా ఆ చెప్పేవాడినే తప్పు పడుతూ మధ్యలో ఆపుతారు. ఇది హ్యూమన్ టెండెన్సీ. సరి చెయ్యటం మీద నాకు బాగా ధ్యాస ఎక్కువ. కానీ అందులో కొంత కూడా నన్ను నేను సరి చేసుకోవాలి అనుకోవటంలో ఉండదు. నేను ఎన్నో కలలు కన్నాను కానీ వాటిని నిజం చేసే ప్రయత్నం నా వైపు నుంచి ఉంది అనుకోను. నా తిరోగతికి నేనెంత కారణమో నాకు తప్ప ఎవరికి తెలియదు. కానీ నేను ఇది తెలుసుకున్నా కూడా మార్చుకోలేను. ఎందుకంటే నా అభివృద్ధి నా ఆలోచనల్లోనే, నా కలల్లోనే ఆగిపోయింది. నా గురించి నాకు 100% తెలుసు అని నేను అనుకోవటం 1000% సరైనది. కానీ దాన్ని నిరూపించే ఆధారం కానీ కాదంటే అవుననే ఆరోపణ కానీ నా దగ్గర ఒక్కటి కూడా లేదు.
ఇదే ఇప్పటి సమస్య. నమ్మకం ఉంటుంది కాని సాక్ష్యం ఉండదు. ఆశయానికి చేరుకోవాలనే ఆశ ఉంటుంది కానీ ఆసక్తి ఉండదు. ఇది అందరి సమస్య. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్న నేను నాలో ఏం జరిగి ఉంటుందో కనిపెట్టలేని నేను నాకేమైందో ఎలా పసిగట్టగలను? కానీ నాకున్న ఇంగితమాధారంగా నేను సరిగ్గా లేనని నాకు రూఢిగా తెలుసు. సరిగ్గా ఉండటం అంటే ఏంటో కూడా తెలుసు. కానీ దాని కోసం ప్రయత్నించాలని లేదు. ఇలాగే అస్తవ్యస్తంగా అర్ధరహితంగా ఉండిపొమ్మని కొన్ని శక్తులు నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. లేచి పరిగెత్తాలనే ఆశ ఉన్న అవిటి వాడిలా ఉన్నాను.
కొన్ని బలహీనతల వల్ల ఎన్నో బాధ్యతలు వదిలిపెట్టి ఇంకెన్నో బాధల్ని తెచ్చుకుంటూ కాలం గడిపేస్తున్న ఎంతో మందిలో నేను ఒకడిని. పరిష్కారం ఉన్నా ఇంకా సమస్యగానే ఉండాలనుకుంటున్నా. కానీ నాకు తెలుసు. ఇది కొన్నాళ్లు మాత్రమే. నేను జయిస్తాను. పూర్తిగా కాకపోవచ్చు. కానీ నన్ను నేను తృప్తి పరచుకునేంత అయినా సాధిస్తాను. మళ్ళీ వస్తాను.
-eckce.
1 comment:
Bagundi basu
Post a Comment