B030 dated at Tadepalligudem the 31.07.T21
చిన్నప్పటి నుంచి టీవీ లో ఎన్నో యాడ్స్ చూసాం. మనకి బాగా గుర్తిండిపోయే యాడ్స్ కూడా కొన్ని ఉంటాయి. నాకు అయితే 2000 సంవత్సరానికి అటు ఇటులో క్రికెట్ మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్ ఒకటి బాగా ఇష్టం. సచిన్ టెండూల్కర్ ఫీల్డింగ్ చేస్తూ బాల్ క్యాచ్ చేయటానికి పరిగెత్తుతూ తన క్యాప్ పడిపోయినా పట్టించుకోకుండా గాల్లోనే ముందుకి దూకి ఒక్క చేత్తో బాల్ పట్టుకుంటాడు. పక్కనే బూస్ట్ డబ్బా ఉంటుంది. దీనికి కారణం బూస్ట్ అని చెప్తాడు. ఇది ఎందుకు నచ్చింది అంటే క్యాప్ పడిపోయినా పట్టించుకోకుండా బాల్ కోసం పరిగెత్తడం, ఎగిరి క్యాచ్ పట్టడం వలనే. ఆ తర్వాత వేరే ఒక లైవ్ మ్యాచ్ చూస్తున్నాం. అది ఇండియా ఆడే match కాకపోయినా అప్పట్లో సోకిన క్రికెట్ జ్వరం వల్ల ఎవరు ఆడినా చూసేసేవాళ్ళం. ఏ దేశపు పోటుగాడో గుర్తులేదు కాని ఒక ఆటగాడు ఇలాగే బాల్ కోసం పరిగెత్తుతుండగా తన క్యాప్ గాలికి ఎగిరిపోతే ఆ క్యాప్ తీసుకుని తలకి పెట్టుకుని అప్పుడు బాల్ కోసం మళ్ళీ పరిగెత్తాడు. చాలా నవ్వొచ్చింది నాకు బూస్ట్ యాడ్ లో సచిన్ కి ఉన్న డెడికేషన్ కూడా లేదేంటి అని. ఇంకా ఎన్నో యాడ్స్ ఉన్నప్పటికీ నన్ను ఎంతో హత్తుకున్న యాడ్ మాత్రం ఒకటుంది. 2011 లో లేదా ఇంకా కాస్త ముందో వెనకో నేను అది చూసాను. ఈ మధ్యన కూడా చూసినట్టే గుర్తు.
అందులో ఒక ధనవంతుడు సూట్ వేసుకుని కార్ వెనక సీట్లో కూర్చుని రోడ్ పై వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతాడు. పక్కనే ఒక కుర్రాడు సైకిల్ తొక్కుతూ కాస్త మాసిన బట్టలతో చెమటలు పట్టిన మొహాన్ని చేతులతో తుడుస్తూ ఆ కార్ పక్కనే ఆగుతాడు. ఆ ధనవంతుడు ఈ కుర్రాణ్ణి చూసి ఎక్కడెక్కడి నుంచి వస్తారో అని తనలో తానే విసుక్కుంటూ కార్ అద్దం ఎత్తేస్తుండగా అది గమనించిన కుర్రాడు కాస్త ఆలోచించి ఆ ధనవంతుడి ఆహార్యం చూసి హాండ్ కఫ్స్ పెట్టుకుని తన జేబులో ఉన్న టై కట్టుకుని షర్ట్ పాంట్ లో tuck in చేసి ఒక డైలాగ్ చెప్పి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోతుండగా ఆ ధనవంతుడు అద్దం దించి ఆ కుర్రాణ్ణి గర్వంగా చూస్తాడు. వాడు చెప్పిన డైలాగ్ ఏంటనే కదా సందేహం: కేవలం రెండు చక్రాలే తేడా అంకుల్, వచ్చేస్తాయ్ అని స్టైల్ గా చెప్తాడు. ఇక్కడ ఆశ్చర్యంగా అనిపించే విషయం వాడు తన ఆహార్యం మార్చుకోగానే మాసిన బట్టలు తెల్లగా మారిపోతాయి. దీనికి సమాధానమే ఎండింగ్ లైన్స్ లో చెప్తాడు యాడ్ రూపకర్త. ఆ కుర్రాడు తన future ని చాలా confident గా predict చేసాడు అనొచ్చు లేదా అప్పుడే ఒక goal పెట్టుకుని బలమైన సంకల్పం పొందాడు అనుకోవచ్చు. ఏది ఏమైనా మంచి counter అయితే ఇవ్వగలిగాడు. ఇంతవరకు జరిగిన సోది కాదు గాని నాకు నచ్చిన మాటలు ఆ చివర్లో వచ్చినవే. కేవలం ఉద్దేశాలలో ఇంత తెల్లదనం ఉన్నప్పుడు బట్టలలో ఎందుకు ఉండకూడదు?
ముందు జరిగినది అంతా వదిలేద్దాం. ఆ ఒక్క మాట మళ్ళీ రాస్తున్నా. ఉద్దేశాలలో ఇంత తెల్లదనం ఉంటే బట్టలలో ఎందుకు ఉండకూడదు? ఇది తెలుగు యాడ్ అవ్వటం వల్ల నాకు అంత బాగా కనెక్ట్ అయింది. వేరే భాషల్లో, అంతెందుకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో కూడా when your ambition shines so much why should your clothes be any different? అని రాసాడు. Ambition అంటే ఉద్దేశం కాదు. కానీ ఉద్దేశం అనే మాటకు ఉన్న బలం ఏ మాటకి రాదు. ఎందుకో చెప్తా. దానికంటే ముందు అసలు విషయం చెప్పాలి, ఇది RIN Radiant బట్టల సబ్బు యాడ్.
మన అందరం ఎన్నో మాటలు వింటాం, మనమూ వినే వాళ్ళకి చెప్తాం. కానీ అవి ఎంత వరకు మనస్ఫూర్తిగా లేదా నిజాలు చెప్తున్నాం? ఖచ్చితంగా మీ ఊహకు అందనంత తక్కువే చెప్తాం. నూటికో నోటుకో ఒక్కడు ఉంటాడు అన్నీ నిజాలు చెప్పేవాడు. అలాంటివాడి కష్టాలు ఎవడికీ రాకూడదు అని జాలి పడేలా ఉంటుంది అన్ని నిజాలు చెప్పే వాడి జీవితం. కానీ ఏ మాటకి ఆ మాట, మనం ఒకటి చెప్తున్నాం అంటే దాని వెనక ఉన్న ఉద్దేశం కూడా అదే అయ్యున్నప్పుడే ఆ మాటకి, ఆ మనిషికి విలువ. మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని దాన్ని నెరవేర్చుకోవటం కోసమో, అవతలి వాడిని impress చెయ్యటానికో, వాడికి నచ్చటం కోసమో మాట్లాడితే దాన్నే కదా డబుల్ యాక్షన్ అంటారు. ఇలా చేసే మన లాంటి వాళ్లందరికీ eckce అనే blogger గా చెప్తున్నాను. దీన్నే కదా మోసం అంటారు. పక్క వాళ్ళని ఎలాగూ మోసం చేస్తావు, నిన్ను నువ్వు కూడా మోసం చేసుకుని ఎవరిచ్చే Oscar పొందుతావు? నీ వల్ల పక్కవాళ్ళకి ఉపయోగం ఉండాలి. అదెలాగు జరగదు. కనీసం నిన్ను నువ్వు మోసం చేసుకోలేదు అనే సంతృప్తి అయినా నీకు మిగలాలి కదా. అది కూడా లేకపోతే నీ మాటల గారడీతో దాచిపెట్టి నెరవేర్చుకున్న నీ ఉద్దేశానికి సరైన నిర్దేశం లేక నిర్దోషిలా నిలబడలేవు.
నువ్వు మంచి వాడివా? అయితే మంచిది. కాదా? నువ్వు మంచివాడివి కాదా? అయినా మంచిదే. అదే అందరికీ తెలియనివ్వు. అంతే కాని లేని మంచి నటించకు. పాటించని మంచి మాటల్లో చూపించకు. నువ్వేంటి అనేది అలాగే చూపించినప్పుడే కనీసం నీ నిజాయితీని లోకం మెచ్చుకుంటుంది. నటిస్తే నమ్మే అమాయకులున్న కాలం కాదిది. నీ నటనను నమ్మినట్టు మేము కూడా నటిస్తాం అంతే. నీ వెనక మేము కూడా నీ లాగే నిన్ను తిట్టుకుని మా ఉద్దేశాల్ని బయటపెట్టుకుంటాం. చూసావా, నీ నటన వల్ల మేము కూడా నటించాల్సి వస్తుంది! ఎవ్వడు తక్కువ కాదు అందరూ నటులే. దీన్ని తగ్గించాలి అంటే ఉద్దేశాల్ని దాచుకోకూడదు. మంచిదైనా చెడ్డదైనా ఉద్దేశమే మాట్లాడాలి. ఉద్దేశాల్లో ఉన్న తెల్లదనం బట్టల్లో కనిపించినట్టే మనసులో మంచితనం ఉన్నప్పుడే బయటకి మంచిగా మాట్లాడాలి. అప్పుడే లోకం అద్దం దించి నిన్ను చూసి గర్విస్తుంది. అంతే కాని లోపల కుళ్లు పెట్టుకుని కూడా బయటకి మంచి మాటలతో మోసం చేస్తే అదే విధంగా మనమూ మోసపోతామని తెలుసుకోవాల్సిందే. ఇక ఇదే చక్రం అవుద్ది.
చివరిగా ఒక్కమాట: ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి రాసింది కాదు. రాస్తున్న, చదువుతున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఉద్దేశించి రాసిందే. నా ఉద్దేశం తెల్లగానే ఉంది మరి. ఇక మీదే.
- ecKce.

6 comments:
Super
Super🤙🤙🤙🤙👌👌👌👌✌✌❤❤❤❤❤😍😍
చాలా బావుంది బావ
బాగుంది 👍👍
Highly imaginative. Great job
నిజాన్ని దాచటం అబద్దం,అబద్దాన్ని నిజం చెయ్యాలనుకోవటం మోసం మేము సామాన్యులం అబద్దాలు చెబుతాం ఎవర్ని మోసం చెయ్యం
Post a Comment