B014 dated at Tadepalligudem the 20.01.T21
ఒక స్నేహితుడు నా దగ్గర తన గోడు విన్నవించుకున్నాక దాన్ని నా తరపున వర్ణించాలని ఇలా రాస్తున్నా.
కొన్ని దెబ్బలు తగిలినప్పడు వెంటనే నొప్పి తెలుస్తుంది. గాయం ఉన్నంతసేపు నొప్పి ఉంటుంది. నొప్పి పోయిన తర్వాత గాయం తగ్గిపోతుంది. ఇక్కడ గాయం నొప్పి ఒకేసారి వచ్చి కాస్త అటు ఇటుగా ఒకేసారి కలిసి కట్టుగా పోతాయి. కానీ కొన్ని దెబ్బలు తగిలినప్పుడు తెలియదు, తగ్గేదెప్పుడు తెలియదు. దెబ్బ పడినప్పుడు నొప్పెయటం కాదు తియ్యగా అనిపిస్తుంది. ఎలా అంటే ఏదో నీతి కథలో రక్తం రుచి మరిగిన జంతువు వేటగాడు పూసిన రక్తపు కత్తిని నాలుకతో చప్పరిస్తూ తన రక్తాన్నే ఆరగిస్తూ చచ్చిపోయినట్టు. దురద పుడుతుంది. కానీ గోక్కుంటేనే బాగుంటుంది. పుండు పెద్దది అవుతుంది అని తెలిసినా గోళ్ళకు అదేం పట్టదు.
ఇదొక ఉచ్చు అని అందులో చిక్కుకున్నప్పుడు తెలియదు. ఒక్కసారి బయటకి వచ్చాకే ఆ ఉచ్చు కంటికి కనిపిస్తుంది. అందుకే అంటారు బయటకి వచ్చి చూడాలి అని. అలాంటి ఎదో ఒక ఉచ్చులో అందరూ ఎప్పుడో ఒకప్పుడు చిక్కి ఉంటారు. అలాంటి ఒక అనుభవమే ఇది. నూరు గొడ్లు తిన్న రాబందు అధోగతి తెలుసు కదా. ఎంత అనుభవం ఉన్నప్పటికీ కొంత వింత అనుభూతి చాలు కదా కథ కంచికి చేరటానికి. తప్పులు అందరూ చేస్తారు. కొన్ని తప్పులు చెయ్యటానికి పెద్దగా ఆలోచించరు. కొన్ని తప్పులు చేసాక అంతగా పట్టించుకోరు. కానీ కొన్ని తప్పులు చెయ్యటానికే కాదు వాటి గురించి ఆలోచించటానికి కూడా భయపడతారు. కానీ తప్పినా తప్పుకున్నా తప్పు చేసాక మాత్రం ఎప్పుడూ భయపడుతూనే ఉండాల్సొస్తుంది. చేసింది ఒకటే తప్పు కావచ్చు. పోనీ అది తెలియక చేసిన పొరపాటే అవ్వొచ్చు. నిజానికి ఆలోచన లో తప్పు ఉంటే మొదట ఆచరించేది మాత్రం నోరు. అవును, తప్పు జారే ముందు నోరు జారుతుంది. ఉరికే అన్నారా మరి, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది అని?
జీవితంలో అతి తక్కువ సార్లు చవి చూసిన చేదు అనుభవాల్లో ఇది ఒకటి. ఇందులోంచి ఎప్పుడు ఏ స్థితిలో బయట పడతానా అని భయాందోళనలతో ఎదురు చూస్తున్నా. జీవితంలో మళ్లీ అనవసరమైన ఇతరుల సమస్యల్లో తల కాదు కదా కనీసం వెంట్రుక కూడా దూర్చకూడదు అని నిశ్చయించుకున్నాను. నిజానికి దూరంగా పారిపోవాలనిపిస్తుంది.
ఇక్కడే నాకొక డౌట్ వస్తుంది. నేను చేసిన ఒక్క తప్పుకే దాని భవిష్యత్ పరిణామాలు ఏంటా అని ఆలోచిస్తుంటే నాకు వెన్ను వణుకుతుంది. మరి ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన పరమ కిరాతకులనబడే నేరస్తుల ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందా అని తెలుసుకోవాలి అనిపిస్తుంది అని కన్నీరుమున్నీరై వాపోయాడు వాడు.
త్వరలోనే తనని పట్టి పీడిస్తున్న ఈ మానసిక రుగ్మతకి కారణమైన ఆ సమస్య(ల) నుంచి బయట పడాలని నాతో పాటు మీరందరూ కోరుకోవాలని కోరిక కోరుతూ
-ఎక్స్
2 comments:
అరేయ్ సాంబ....రోజు రోజు కి నీ కలం పదును ఎక్కుతుంది.....
అన్వయించికొని రాస్తున్నావో....అనుభవించి వేస్తున్నావో తెలియదు కాని...సామెతలు దాని కిత కితలు అద్భుతం....
ఆ వ్యక్తి కి ఆ సమస్య దూరం అవ్వాలని కోరుకుంటున్నాను...
కరడు కట్టిన నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని వుంది అన్నావ్ కదా బావ నేను ఒక బుక్ లో చదివా వాళ్ళు తమని తాము మంచి వాళ్లమని అనుకుంటారంట పరిస్థితులు లే తమని నేరం చేయమని ప్రోత్సహించాయని లేకుంటే తమంతటి మంచివాళ్ళు లేరని అనుకుంటారట...
Post a Comment