Sunday, February 21, 2021

Coward-Awkward

B018 dated at Tadepalligudem the 21.02.T21


All my life I used to be a freaking coward. 


నేను బ్రతికిన రోజులన్నీ భయపడుతూనే ఉన్నాను. కొన్నిసార్లు నేను తప్పు చెయ్యటానికి భయపడను కానీ చేసిన తర్వాత భయపడతాను. అవసరం లేని చోట, అవసరం లేని వాళ్ళకి కూడా భయపడతాను. ఏమైనా జరిగితే భయపడతాను. ఏదైనా జరుగుతుందేమో అని భయపడతాను.


ఎవరైనా ఏమైనా అంటే భయపడతాను, ఏదైనా అంటారేమో అని భయపడతాను. ఏదైనా చెప్పటానికి భయపడతాను. ఏమైనా చెప్పాక భయపడతాను. అన్నిటికంటే ముఖ్యముగా ఎవర్నైనా ఏదైనా అనాలంటే భయం, అడగాలంటే భయం. ఒక పిరికివాడిని నేను.


దేవుడు నన్ను ఒక భయస్తుడిగా చేశాడా లేక నేనే ఒక పిరికివాడిలా పెరిగానా? నా మొదటి భయం మా నాన్న. ఏదైనా తప్పు చేస్తే నన్ను మా చెల్లిని గోడ కుర్చీ వేయమన్నప్పుడు నేను ఒక కుర్చీని గోడకి ఆనించి పెడితే ఎలా ఉంటుందో అలాగే కూర్చునే వాడిని. మా చెల్లి మాత్రం గోడకి ఆనుకుని ఒక కాలు లేపి మోకాలు దగ్గర పెట్టి నిలబడి రిలాక్స్ అయ్యేది. నాకు భయం. ఏం చేస్తారనో తెలియదు,  కనీసం ఆలోచన కూడా లేదు. నాన్న అంటే భయం అంతే. ఇందాక అన్నాను కదా ఏదైనా తప్పు చేస్తే అని. అదేంటి అంటే ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్లటమే. నాకు గుర్తున్న నా చిన్నతనం అంతా నేను మళ్ళీ మళ్ళీ చేసిన తప్పు ఇది ఒక్కటే. రోజూ ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్లిపోవడమే. బయటకి అంటే బలాదూర్ తిరగటానికి అనుకునేరు. మేము ఇల్లు మారాము. కానీ మా పాత ఇంటి దగ్గర ఉండే వాతావరణం అలవాటు  అయ్యి అక్కడికే వెళ్ళాలి అనిపించేది. చెప్తే వెళ్ళనివ్వరు అనో లేక వెళ్ళినపుడు తిట్టారనో గర్తు లేదు కానీ ఎప్పుడూ చెప్పకుండా ఇంటి వెనక నుంచి జారుకోవటమే జరిగేది. ఇంటికి వచ్చాక వాళ్ళని మళ్ళీ ఎదుర్కోవాలంటే భయం. అయినా రోజు అలాగే చేసేవాడిని. ఒక రోజు అలా ఇంటి వెనక నుంచి గోడ దూకి వెళ్తూ వెనక నుంచి ఎవరైనా చూస్తున్నారేమో అని వెనక చూస్తూ ముందుకు పరిగెడుతూ స్తంభాన్ని గుద్దుకున్నా. నొసలు మీద రక్తంతో ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కే వచ్చా.


ఇలా ఈ భయానికి తోడు నాకున్న మరో మా చెడ్డ అలవాటు మొహమాటం. ఎవరితోనూ కలవలేకపోవటం. ఇప్పటికీ నేను ఎవరికి తెలియకుండా కవర్ చెస్తున్న అలవాటిది. కానీ చాలామందికి దొరికిపోతాను. ముఖ్యంగా బంధువుల దగ్గర. ఆ అనుభవాలు చెప్పుకోకపోతేనే మంచిది. Miserable. ఇప్పటికి కూడా చాలామంది బంధువులు, ఊళ్ళో వాళ్ళు ఫోన్ అయినా చెయ్యవేంటి అంటారు. నా దగ్గర సమాధానం లేని ప్రశ్న ఇది. ఒకవేళ ఎవరైనా నాకు ఫోన్ చేసినా నా వైపు నుంచి ఊ కొట్టడమే తప్ప అడిగి చెప్పటం ఏం ఉండవు. అందుకేనేమో నేను ఫోన్ చెయ్యను ఎవరికి. వాళ్ళు అడిగిన తర్వాత చేస్తే అడిగాం అని చేసాడు అనుకుంటారేమో అని భయం. అలా అనుకోకూడదు అని కొంత చెయ్యను ఫోన్.


నన్ను భరించిన నా కుటుంబ సభ్యులు, బంధువులు, కొంతమంది మిత్రులు. వీళ్లంతా మహానుభావులు.


ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కోవడం నాకు తెలియదు. అనుభవం లేకపోవటమే కారణం అవుతుంది. ఇది అందరిలో ఉండే లోపమే. కానీ నా మట్టుకు నేను అలాంటి పరిస్థితుల్ని చాలా కష్టంగా దాటుతూ ఉంటాను. అలాంటి పరిస్తితులు నాకు ఎదురైన ప్రతిసారి నాకు తోడుగా ఎవరో ఒకరు స్నేహితుడుగా ఉండే వారు. వాళ్ళు కూడా మహానుభావులు.


ఇక నాలో ఇప్పటికీ కొనసాగుతున్న భయం గురించి చెప్పాలంటే నీతో కొంచెం మాట్లాడాలి అని ఎవరయినా నాతో అంటే నాకు భయం. మాట్లాడే వరకు టెన్షన్ ఏం మాట్లాడతారో అని. ఎవరైనా పాత స్నేహితుడు నాకు ఫోన్ చేస్తే నాకు భయం. దేనికి చేస్తున్నాడు అని. ఇలా అనుకోని పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే భయం ఏం జరగబోతుంది అని. ఎవరైనా కాస్త గట్టిగా మాట్లాడితే నాకు భయం ఏం సమాధానం చెప్పాలో అని.


పచ్చిగా చెప్పాలి అంటే వాళ్ళు పీకేది, నాకు ఊడేది ఏం ఉండదు. నేను ఏం జరిగినా తట్టుకోగలను, ఎదుర్కోగలను. అలవాటు అయ్యాయి ఎన్నో, అనుభవాలు ఉన్నాయి మరెన్నో. అయినా నాకు భయం. ఆ సమయంలో మాత్రం నా గుండెల్లో అదురు, నా మాటల్లో బెదురు బయట పడకనే పడతాయి. అందుకే నేను ఎక్కువగా సైలెంట్ గా ఉండటానికి ప్రయత్నిస్తా. దాని వెనక ఉన్నది నా ప్రశాంతత అని చెప్తే నేను అబద్దీకుడిని అవుతాను. నేను ఒక భయస్తుడిని.


నాకు గొడవలంటే భయం. వాటికి దూరంగానే ఉంటాను. ఎందుకంటే గొడవ పెట్టుకుని మళ్ళీ కలిసిపోయే మెంటాలిటీ నాకు లేదు. నేను ఒకరితో గొడవ పడితే మళ్ళీ చాలా రోజులు మాటలు ఉండవు. కానీ కొంతమంది పక్క పక్కనే ఉంటారు. రోజు సీరియస్ గా గొడవ పడతారు. మళ్ళీ కలిసిపోతారు. కానీ వాళ్ళు మళ్ళీ కలిసేది మళ్ళీ గొడవ పడటానికే అని తర్వాత తెలుస్తుంది. అలాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చెయ్యను. గొడవ పెట్టుకున్నాక మళ్ళీ మాట్లాడాలంటే నాకు చాలా మోహమాటం. అందుకే నా వాళ్ళు ఎవరైనా గొడవకి వెళ్తే నేను వాళ్ళతో పాటు వెళ్లను. దూరం నుంచి చూస్తాను. దగ్గర ఉంటే ఇన్వోల్వ్ చేస్తారు అని భయం.


కొంతమంది కి దొరికిపోతాను భయపడి దాక్కున్నాను అని. దాన్ని నేను కవర్ చెసుకోను. నేను నిజంగా దాగుకునే పిరికివాడినే. 


నాకున్న రెండో చెడ్డ అలవాటు మొహమాటం గురించి అయితే ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. ఎవరిని అయినా ఏమైనా అడగాలి అంటే మొహమాటం, ఇవ్వరేమో అని. ఎవరైనా ఏదైనా అడిగితే మోహమాటం ఇవ్వకపోతే ఏమనుకుంటారో అని. ఒకరి దగ్గర రెండోసారి సహాయం తీసుకోవాలి అంటే మొహమాటం. ఎవరికైనా అడగకుండా ఏదైనా ఇవ్వాలి అన్నా కూడా మోహమాటమే తిరస్కరిస్తారేమో అని. ఏదైనా పని చెప్పాలంటే మోహమాటం చెయ్యను అంటారేమో అని. బేసిక్ గా నేను నో చెప్పించుకోవటం అంతగా సహించలేను. ఇనీషియేటివ్ తీసుకొని కొత్త వాళ్లతో మాట్లాడలేను, సహాయం అడగలేను మొహమాటం వల్ల. అలాంటి పరిస్థితుల్లో కూడా నాతో పాటు ఉంటూ నాకు ప్రతిగా సహాయం అడిగి, చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మహాహానుభావులు. 


నిజానికి ఈ ముఖమాటం వల్ల నాకు ఎన్నో సార్లు క్షవరం, గుండు, గర్భ ప్రసూతి, కొన్నిసార్లు గర్భస్రావం కూడా అయ్యాయి. ఈ మోహమాటం వల్లే అబద్దాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకి బయట వ్యక్తి దగ్గర మోహమాట పడి ఏదైనా అనవసర వస్తువు ఎక్కువ ధరకి కొని ఇంటికి తెస్తే ఇంట్లో తిడతారని భయంతో అబద్ధం చెప్పాలి. ఇది ఉదాహరణ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో అలా చెయ్యటం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయ్యిన పని. మా నాన్న గారికి వేపకాయంత మొహమాటం ఉంది. నాకు పుచ్చకాయ అంత అబ్బింది.



నన్ను కని పెంచటంలో నా తల్లిదండ్రుల శ్రమని, ఓర్పుని మెచ్చకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా పైన పేర్కొన్న మహానుభావులు అందరికీ నా వందనాలు. 


నాకున్న మైనస్ లన్నీ ఇలా చెప్తుంటే మీరు రకరకాలుగా అనుకోవచ్చు. మాకెందుకొచ్చింది ఇవన్నీ అని, ఏదో గొప్పలుగా చెప్పుకుంటున్నాడని, అసలెందుకు చెప్తున్నాడని, సుత్తి, టైం వేస్ట్ అయ్యింది అని. దీని వల్ల కొందరైనా నా మానసిక స్థితిని అర్ధం చేసుకుని పదర్థాలు తీసి నన్ను అపార్ధం చేసుకోకుండా ఉంటే అనర్ధాలు జరగకుండా ఉంటాయని భయం, మొహమాటం ఇంకా సిగ్గు లేకుండా ఈ యదార్ధాలు రాసేసాను.


-ఎక్స్

1 comment:

NG said...

Greatest battles are with closest people

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...