Wednesday, March 31, 2021

ఎవరి మాట వినాలి?

B21 dated at Tadepalligudem the 31.03.T21


నా జీవితంలో నేను ఇప్పుడు ఒకరిని శాసించే స్థానంలో లేకపోయినా వంద మందికి చెప్పే స్థాయిలో అయితే ఉన్నాను. దానికి కారణం నేను నడిచిన దారులు అందులో నేను ఎదుర్కున్న దారుణాలు. ఎన్నో ప్రతికూల పరిస్తుతులతో ఒంటరిగా పోరాడాను.  శారీరక, సాన్నిహిత్య, సంసార సమస్యలు సంకట సంఘటనలై సంఘర్షణ చేస్తుంటే  అసంతృప్తి సాగరాన్ని రహస్య సైనికుడినై ఎదురీదాను. నా అనుభవాలే నా అర్హతలు.


ఎవరి జీవితాన్ని వారు మలుచుకునే సమయం, అవకాశం ఈ సమాజం ఎప్పుడూ ఇవ్వదు. సరిగా ఆలోచించే జ్ఞానం అలవర్చుకునే అనుభవం వచ్చేలోపే జీవితంలోని కీలక నిర్ణయాలు అప్పుడే తీసుకోమంటుంది. దానికోసం అప్పటికే అనుభవం పొందిన వారితోపాటు మార్గదర్శి లో చేరమంటుంది. వాడు బాగు పడితే అనుకోవచ్చు కానీ వాడు కూడా మనలో ఒకడే. కాకపోతే కాస్త ముందుగా చెడిపోయి ఉంటాడు అంతే. 

మున్ముందు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని ఎంతో మంది ఇలా ఇతరుల మార్గంలో నడిచి మడమ ఇమడక నడుం సహకరించక మధ్యలో ఆపలేక జీవిత చట్రంలో జన్మఖైదీలుగా మిగిలిపోయారు. దాన్నే రాత అని సరిపెట్టుకుని వారి విషయంలో ఇతరులు చేసిన తప్పుని వారి పిల్లల విషయంలో మళ్ళీ చేసేస్తున్నారు. ఇదోరకం జీవన చక్రం.


అనుభవజ్ఞులైన ఎంతో మంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్తే వినాలి అని. ముందుగా చవి చూసిన వాళ్ళ అనుభవాన్ని మనం అలవర్చుకోగలమా? ఒకరి అనుభవం మనకి అదే అనుభూతిని ఇస్తుందా? ఒకడు పెళ్లి చేసుకుని అందరూ తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. మరొకడు జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఇదే, నువ్వు మాత్రం చెయ్యకు అంటాడు. పెళ్లి అని కాదు గాని అన్ని విషయాల్లోనూ ఇలాంటి అనుభవజ్ఞుల్లో ఒకడు అన్ని భోగాలు అనుభవిస్తాడు కానీ నువ్ ఈ రొచ్చులోకి దిగకు నేను నరకం చూస్తున్నాను అంటాడు. ఇంకొకడు అయితే వాడిలా ఇంకొకడు సుఖపడకూడదు అని చచ్చు సలహాలిచ్చి నాశనం చేస్తాడు. పాపం ఒకొకడు నిజంగానే మంచి సలహా ఇస్తాడు గాని మనకే నమ్మబుద్ధి కాదు. వీళ్లని గుర్తు పెట్టుకోండి. తర్వాత వాడదాం.



అసలు ఎవరి మాట వినాలి? ఏదైనా చేసే ముందు అందరూ ఇచ్చే సలహాలు విని ఎవరిని అనుకరించాలి? ఎవరిని అనుసరించాలి? 

ఎవరిది పట్టించుకోవాలి? ఎవరిది పక్కన పెట్టాలి? 


సొంత నిర్ణయంతో ముందుకు వెళ్తే ఆశించని ఫలితాలకు స్వీయ సంజాయిషీ ఇచ్చుకోవాలి. పోనీ ఇరుగు పొరుగు అనుభవాలపై మోజు పడి అనుకరణ చేసినా దెబ్బ తగిలితే మనమే మందు పూసుకోవాలి. ఎలా అయినా వృధా చేసిన మన కాలం, శ్రమ అనుభవ రూపాన్నీ దాలుస్తాయిలే.  ఏమి చేసినా ఎలా చేసినా అది సరిగా చేశామా అన్న దాని మీదనే ఫలితం ఆధారపడినప్పటికీ అసలు అది చెయ్యాలా వద్దా అనేదే ఇక్కడ మూల ప్రశ్న. ఎందుకంటే వడ్లు చూడాలి అనుకున్నప్పుడు వరి పంటనే వెయ్యాలి కానీ జొన్నపంట కాదు. చేయబోయే పని నచ్చదు అనుకుంటే నచ్చే పని చెయ్యాలి అనుకోవాలి కానీ చేసేకొద్ది నచ్చుతుందేమో అని భ్రమలో బ్రతకటానికి సిద్ధం అవ్వకూడదు. సిద్ధం అయ్యావ్ అంటే అది భ్రమ కాదు నిజం అని నమ్మటం అలవాటు చేసుకుంటూ స్వీయ మోసం ఆత్మద్రోహం చేసుకోవాలి.



మరి ఎలా? ఎలా? 

ఇంకా అంత ఆలోచించలేదు. ఏమైనా వచ్చాక మళ్ళీ వస్తా.


-eckce.

2 comments:

JAGAN said...

Sir idantaa meeru rasinadena

Sagarchinnu said...

Mama nuvvu super mama

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...