Sunday, April 11, 2021

నిన్నటి తప్పు

B23 dated at Tadepalligudem the 11.04.T21


అందరూ తప్పులు చేస్తారు. కొందరు ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తారు. దాన్ని వారి బలహీనత లేదా లోపం గా చెప్పొచ్చు. కొందరు మళ్ళీ మళ్ళీ  వేర్వేరు తప్పులు చేస్తారు. వీరి తప్పులు మారతాయి కానీ వారి ఆలోచన మారదు. కొందరు అయితే ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇపుడు మన టాపిక్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్ అనుకుని తెలియక పొరపాట్లు చేసేవారి గురించి. కాదు కాదు కరెక్ట్ అనుకుని తెలియక చేసే పొరపాట్ల గురించి. పోనీ వాళ్ళు ఎదో తెలియక చేశారు, కానీ అవి తప్పులు అని తెలిసేది ఎప్పుడు? జరిగింది రివ్యూ చేసుకున్నప్పుడో లేక ఎవరైనా నువు చేసింది తప్పు అని చెప్పినప్పుడే కదా. నా మట్టుకు నాకు మళ్ళీ చదివితే నేను నిన్న రాసిన బ్లాగ్ లో కూడా తప్పులు కనిపిస్తాయి. మనం చేసే టైమ్ కి ఎంత వెతికినా కనిపించని ఆ తప్పులు కొంత కాలం తర్వాత భలే దొరుకుతాయ్. దీన్నే కాలం చేసే చమత్కారం అనొచ్చు.

బహుశా మనం తప్పు చేయట్లేదు అనే భావనే మన తప్పుల్ని కనిపెట్టే వివేకాన్ని వాటి పనిపట్టే జ్ఞానాన్ని కనికట్టు చేస్తాయేమో. విషయం విపరీత స్థాయికి చేరినప్పుడే ఇంద్రియాలు మందు తాగినట్టు ప్రవర్తిస్తాయంట. అలాంటపుడు మనం చేసేవి, మాట్లాడేవి మన అదుపులో ఉండవు. కానీ తర్వాత మాత్రం గుర్తు చేసుకుంటే భలే సిగ్గేస్తుంది. 


ఉదాహరణకు నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక notebook లో డైరీ రాసేవాడిని. అది కూడా ఇంగ్లీష్ లో. వేరే వాళ్ళకి అర్ధం కాకూడదని అలా రాసానో లేక నాకు ఇంగ్లీష్ వచ్చు అని అనుకున్నానో ఏమో కానీ ఇప్పుడు చదివితే అది నాకు కూడా అర్ధం కాదు. నాకున్న జ్ఞాపకశక్తి వల్ల వాటికర్ధం తెలుస్తుంది కానీ అసలు అర్థమే లేని రాతలు అవి. కొన్ని రోజుల తర్వాత ఇవి కూడా అలాగే అనిపించొచ్చేమో.


మనం చేసేవి, చూసేవి, రాసేవి ఆ టైమ్ కి బాగుంటే చాలు అనుకునే వాళ్ళు కొందరు అయితే అవి ఎప్పటికీ బాగా ఉండాలి అని ఆచితూచి నడుచుకునే వారు కొందరు.


ఇంతకీ మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా ఆ తప్పుని వేలెత్తి చూపిస్తే మనకి ఎలా ఉంటుంది? అందరికి కాలుతుంది. కానీ కొందరే తప్పుని ఒప్పుకుంటారు. కొందరు పెద్ద తప్పేం కాదంటారు. కొందరు తప్పే అయితే ఏంటి నేను ఒక్కడినే చేశానా ఇలా అని వాదిస్తారు. కొందరు నువ్ ఎవడివి చెప్పటానికి అంటారు. కొందరు మాత్రం చాలా డిప్లొమేటిక్ గా నువ్ మాత్రమే నాలో తప్పులు వెతికి చూపిస్తావ్ అంటారు. మనల్ని పొగిడారో తిట్టారో తెలియని సందర్భం అది. నేను మాత్రం ఈ అన్ని రకాల రియాక్షన్స్ ని చూసాను.


చాలా తక్కువ మంది మనం తప్పుల్ని చెప్పినప్పుడు thanks for correction అంటారు. అలా అన్న వాళ్ళ inner feeling మనం చూడలేము కానీ వాళ్లలో కొంతమంది మనం వాళ్ళ గురించి మంచిగా అనుకోవాలనే అలా చెప్తారు తప్ప లోలోపల తిట్టుకునే బ్యాచ్ అది. మనం ఎప్పుడు తప్పు చేస్తామా వెతికి పట్టుకుందాం అని  కనిపెట్టుకుని ఉంటారు. అది ఒకందుకు మంచిదేలే మనం కూడా అప్రమత్తంగా ఉండొచ్చు.


ఏది ఏమైనా ఎప్పుడు కుదిరితే అప్పుడు గతంలో మనం ఏమైనా తప్పులు చేశామా దాని వల్ల ఎవరైనా అవస్థలపాలయ్యారా అనేది ఆలోచించటం మన కనీస బాధ్యత అనేది నా ఆలోచన. ఎందుకంటే మనం తెలిసీ తెలియకుండా చేసిన తప్పుల వల్ల వేరే వాళ్ళకి మనం శతృవుగా మారితే దాని వల్ల మనకే నష్టం. ఒకరి దగ్గర మంచివాడిగా అనిపించుకోవటం అంత సులువు కాదు కదా. నా ముందు ముఖస్తుతి చేసేవాడిని, నా వెనక నా తప్పుల్ని, బలహీనతల్ని హేళన చేసేవాడిని నేను ఎప్పటికి నమ్మను. 



కాబట్టి మన ప్రవర్తనని జడ్జ్ చేసే అవకాశం అవతలివాడికి ఇచ్చినప్పుడే మన లోపాలు మనకి తెలుస్తాయి. అదే అవకాశం మనకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మంచికోసం ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కానీ వారు నొచ్చుకునేలా కాదు. ఊరికే హర్ట్ అయిపోవడం లాంటి చిన్న తరహా చేష్టలు తగ్గించి హుందాగా ప్రవర్తిస్తేనే అందరికి మంచిది. 



ఈ పోస్ట్ జనహితార్ధం జారీ చేయటమైనది.


eckce

2 comments:

Suresh babu . D said...

Bagundi.
Manam chesina teliyani thappula valla verevallu ibbandipadochu anedaniki kuda example ivvandi.

Kaizen mohan said...

బాగుంది బావ
తప్పుని తప్పని ఎత్తి చూపే మనస్తతత్త్వం తప్పు అనే కొందరి భావన తప్పు

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...