B24 dated at Tadepalligudem the 16.04.T21
చిన్న చిన్న పిల్లలు చక్రాలు సాధిస్తున్నారు, నువ్వేమో బయటకెళ్లి ఆ అంటే ఊ అనలేవు అని చిన్నప్పుడు మా అమ్మ తిట్టేది. ఆ మాటలో ఎంతో అర్ధం ఉంది. ప్రతి అమ్మ చిన్నప్పుడు పిల్లల్ని అలా అని ఉండొచ్చు కానీ ప్రతి పిల్ల లేదా పిల్లవాడు పెద్దయ్యాక కూడా అలాగే ఉండరు. నేను మాత్రం మా అమ్మతో ఇప్పటికీ అలా తిట్టించుకోవటానికి అర్హుడినే. మా అమ్మ ఇప్పుడు అలా తిట్టట్లేదు అంటే అది ఆమె సంస్కారం. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను బయట ఏదైనా పని చేయాలి అంటే ఎవరితో అయినా తోడుగా వెళ్లి లేదా ఎవరిని అయినా తోడు తీసుకెళ్లి వాళ్ళ చాటున ఉంటూ పని ముగించుకునే చేతకాని వాడిని నేను.
ఎంత చేతకాని వాడిని అంటే మా అమ్మ స్థానంలో నా పిల్లల అమ్మతో తిట్లు తినే స్థాయికి వచ్చిన వాడిని. కానీ నాకు అర్దం కానిది, ఇప్పుడే తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే కొంతమంది తెలివైన వారికి అలుసుగా ఏర్పడిన నా బలహీనతగా ఇది మారటం.
ఎక్కువ మాట్లాడకపోవటం నా బలం అనుకుంటాను నేను. దానివల్ల గొడవలు తక్కువ అవుతాయని భావించి వీలైనంత తక్కువ మాట్లాడుతూ చేతనైనంత ఎక్కువ పని చేస్తూ ఉండాలి అనుకుంటాను. కానీ నా మౌనానికి వారి గొంతుని జత చేసి నా భయాన్ని వారి బలంగా మార్చుకుని నా పక్కన ఉండాల్సిన వారు నన్ను పక్కన పెట్టేస్తే నేను బలంగా అనుకునే నా బలహీనతను నిందించాలా? లేక నాకు చేతకాని గాంభీర్యాన్ని నటించాలా?. మూడో తరగతి పిల్లాడికి ఉండాల్సిన అలవాట్లే ఇంకా నా రోజులో భాగాలుగా ఉంటే ఇంకా మా అమ్మ నన్ను అలా అని ఉండటంలో ఆశ్చర్యం లేదు.
ఒకడు పెద్దవాడు అనిపించుకోవాలి అంటే వయసు పెరిగితే సరిపోదు, చిన్నతనపు అలవాట్లని విడిపించుకోవాలి. ఒకడు గొప్పవాడు అనిపించుకోవాలి అంటే గొప్పగా ఆలోచిస్తే సరిపోదు, గొప్పలకి పోకుండా ఉండటం నేర్చుకోవాలి.
నన్ను ఎవరూ చెడ్డవారు అని అనుకునే అవకాశం నేను ఎవరికి ఇవ్వను కానీ వారి అజ్ఞానం అలా నడిపిస్తే నేనేం చేయలేను. కానీ నన్ను మంచివాడు అంటూనే ముంచే వాళ్ళ నుంచే తప్పించుకోలేకపోతున్నాను. ఎవరిని ఏమీ అనలేని నా బలహీనత ఏమీ అనడులే అనే వారి ధైర్యం ద్వారా ఏమైనా చేయొచ్చులే అనే వారి ఆలోచన ఏమి చెయ్యలేని నా స్థాయిని సూచిస్తుంది.
నా బలహీనతని అలుసుగా తీసుకున్న వాళ్ళని హెచ్చరించలేను, నన్ను బాధ పెట్టినవారిని శపించలేను. అలాగని ఊరికే అన్నిటిని సహించలేను. ఎందుకంటే నా ఖర్మ ఫలానికి ఎవరిని బాధ్యుల్ని చెయ్యను. మా అమ్మ మొదట్లో చెప్పిందే నిజం అయింది, ఎవరెవరు ఏమేమి చక్రాలు సాధిస్తున్నారో చూసి కనీసం వారికి నేను గుర్తు లేనే అని ముందు బాధపడి, తర్వాత వారి విషయమై ఆనందపడి కన్నీరుని పన్నీరుగా మార్చుకోవటమే నా వంతు అయ్యింది.
-eckce
1 comment:
No comments Boss
Post a Comment