Saturday, April 24, 2021

Be Careful

B25 dated at Tadepalligudem the 24.04.T21


ప్రతిరోజు రాత్రి ఏదొకటి రాయాలి అనుకోవటం నా ఆశ. కానీ రోజూ అలా రాయలేనటుంది నా ధ్యాస. ఎందుకంటే ఏదో రాయాలి అనిపిస్తే రాయలేను. ఇది రాయాలి అనిపించేలా ఏదైనా జరిగితేనే రాయగల్తాను. ఎందుకంటే నా చేతి రాతని నడిపించేది నా తలరాతే. 


ఇది రాద్దాం, అది రాద్దాం అని కొద్ది కొద్దిగా అర్ధాలు వెతికి వాటి మొద్దు ముద్రలు భద్రంగా పెట్టుకున్నా కానీ వాటికి ఇప్పుడప్పుడే విముక్తి కలిగేలా లేదు. 


ఇప్పుడైతే ఇదే రాద్దాం అని వచ్చాను. ఏదంటే, వెంటనే చేద్దాం అనుకున్న కొన్ని పనులు హా చూద్దాం అనే స్థాయికి చేరి, తర్వాత చేద్దాంలే అనే స్థానంలో ముగుస్తాయి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి నేనైతే వచ్చే సోమవారాన్నో, ఒకటో తారీఖునో ఎంచుకుంటాను. అది సెంటిమెంట్ కాదు గాని నా బలహీనత. ఈ లోగా ముందస్తు కార్యకలాపాలు ఏర్పాట్లు చేస్కోవటానికి బాగుంటుంది అనే సాకుతో కాలయాపన చేస్తాను. తర్వాత అది చెయ్యాలనే ఉత్సాహం తగ్గి అది చెయ్యకపోతే ఏమైద్దిలే అనే నిర్లక్ష్యం పెరిగి ప్రణాళికలు ప్రక్షాళన పాలవుతాయి.



కానీ ఒక కొత్తపని అలవాటు చేసుకోవటానికైనా లేదా ఒక పాత అలవాటుని మానెయ్యటానికైనా రెండు బలమైన సహకార్లు ఉండాలి. అంటే ఈ రెండిట్లో ఒకటైనా ఉండాలి. ఒకటి ఎలాగైనా చెయ్యాలనే దృఢ సంకల్పం. ఇది అందర్లో ఉండటం కాస్త ఇబ్బందే. అందుకే కాస్త సులువైనది రెండోది ఉంది. అదే మనతో పాటు ఆ పని చేసే మరో సహచారిని వెతుక్కోవటం. ఒకరి సంకల్పం సరిపోనప్పుడు ఇద్దరి సమాన ఆలోచనల్ని సమాంతరంగా సానపడితే ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఆ పని పూర్తి చేసే అవకాశం ఉంది.


అందునే నేను ఒంటరిగా చేసే కంటే జంటను వెతుక్కుని పని చెయ్యాలని చూస్తాను కానీ నాకు జతగా ఉండటానికి ఎవరూ సాహసించరు. కనీసం సహకరించరు. నిజానికి నా తోడు సహించరు. 


అలా ఎన్నో, ఎన్నో శంకుస్థాపనలు కనీసం పునాదిరాళ్లు లేకుండా ఆగిపోయాయి నా జీవితంలో. కొన్నైతే సగం వేసిన పిల్లర్లతోనే మిగిలిపోయాయి. ఈ మాట రాస్తుంటే ఒకటి గుర్తు వచ్చింది. చిన్నప్పుడు మా ఇంటికి కాస్త దూరంలో ఒక ఇల్లు పునాది వేసి పిల్లర్లు లేపి అలాగే వదిలేశారు. అలా చాలా నెలలు ఉండిపోయింది. ఇటుక, ఇసుక, సిమెంట్ కొనుక్కోవటానికి డబ్బులు లేకపోతే అలా కొన్నాళ్ళు కట్టుబడి ఆగిపోవటం పల్లెటూళ్ళలో మాములే కదా. ఎన్ని ఏళ్ళైనా ఆ సగం పిల్లర్లు అలాగే మిగిలిపోయాయి. దానికి కారణం కనుక్కున్న నేను షాక్ తిన్నాను అనటం చిన్నమాట అవుతుంది. సరిగ్గా ఆ ఇంటి మీద నుంచి కరెంట్ సర్వీస్ వైర్లు వెళ్ళటం వల్ల అది పూర్తి చేయొద్దని చెప్పారంట. అందుకే అది సగం కట్టిన బిల్డింగ్ లాగే మిగిలిపోయింది. ఇక్కడ మీ మరియు అప్పటి నా ప్రశ్న: *ముందు చూస్కోలేదా?*


కనీస ముందు జాగ్రత్త లేకుండా పనులు మొదలు పెడితే వచ్చే ఆర్థిక, కాల నష్టాల గురించి చెప్పటమే ఈ గతపు కథని చెప్పటానికి కారణం.


మనిషి విఫలం అవటానికి సగం కారణం కనీస సొంత ప్రణాళిక లేకపోవటం. మిగతా సగంలో సగం కారణం వేసిన ప్రణాళికను అమలు పరచలేకపోవటం. జీవితంలో చాలా మెట్లు, ఎత్తులు అవరోహిస్తాం. నిన్నటి సమస్య రేపు కూడా ఉంటుంది అనుకోకూడదు. కానీ నిన్నటి సమస్యకి ఈ రోజే పరిష్కారం చూపించాలి అంటే proper planning చాలా ముఖ్యం. ఒకోసారి మన ప్రమేయం లేకుండానే మన ప్రణాళికలు మన వాళ్ళ అమాయకత్వం వలనో బయటవాళ్ళ టక్కరితనం వలనో పటాపంచలవుతాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే మరి. జాగ్రత్త అనే మాటకి స్వచ్ఛమైన అర్ధం తెలుసుకునే రోజుల్లో ఉన్నాం. అందుకే చెప్తున్నాను. జాగ్రత్త.



-eckce

7 comments:

bhuvanachakra7 said...

చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి...
కాలయాపన చేయడం నాకు అలవాటే... బయట పడాలి...
చాలా మంచి ఆలోచన షేర్ చేశారు బ్రదర్... ధన్యవాదాలు

Unknown said...

Superb analysis .

Unknown said...

Superb MMR garu..

Avb1994 said...

చాలా బాగుంది.

Unknown said...

అందరూ ఇలానే చేద్దాం చూద్దాం అనే దోరణి లోనే ఉంటాం sir

Prasad said...

Super ra! Good thoughts. Keep going.worth reading too!

Unknown said...

Nenu last varaku lite tiskuni.. last lo perfection vache varaku wait chestanu..adedo first ye start chesi early ga complete chesthe baguntadi..

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...