Monday, April 26, 2021

Hey birthday, it's my wishes to you.

B26 dated at Tadepalligudem the 26.04.T21


నాకు పదేళ్లు ఉన్నప్పుడు ఒక రోజన మా అక్క పుట్టినరోజు వచ్చింది. మా ఇద్దరికీ ఐదేళ్లు తేడా. ఆ రోజు మా అక్క చేత చిన్న బుట్ట కేక్ కట్ చేయించారు మా ఇంట్లో. ఒక పుట్టినరోజు అలా చేయటం అదే మొదటిసారి మా ఇంట్లో. ఇదేదో బాగుంది ఇంకో 12 రోజుల తర్వాత తమ్ముడి పుట్టినరోజు వస్తుంది కదా అది బాగా చేద్దాం అని మా అక్క అన్నది. అబ్బా టీవీ, సినిమాల్లో చూసాను, నేను మా ఇంట్లో కేక్ కట్ చేస్తాను అనే ఆలోచనే నాకు సిగ్గు (ఆనందంతో పడే సిగ్గు లే) తెప్పించింది. ఆ రోజు రానే వచ్చింది. అర కేజీ కేక్ తెచ్చి ముందు రోజు రాత్రే ఫ్రిడ్జ్ లో పెట్టారు. మా అమ్మమ్మ, తాతయ్య కూడా మాతోనే ఉన్నారు. తలస్నానం చేసిన తర్వాత అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాము అందరం. అప్పుడు అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటన మా ఉత్సాహాన్ని, ముఖ్యంగా నా ఉద్రేకాన్ని అణచివేసింది. నా మొహం మాడిపోయింది. ఇంక వేడుక పావంతరంగా ఆగిపోయింది అనుకున్నాను. నన్ను చూసిన మా వాళ్ళు వేదిక సిద్ధంగానే ఉంది, వేడుకకి ఆటంకం ఏం లేదు అని అర్ధం వచ్చేట్టు నన్ను ఓదార్చారు. కేక్ కోసా, అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నా. చాలా ఇబ్బందిగా అలా చేశా. ఆ అలవాటు కానీ అనుభవం కానీ ముందు లేవు. ఆ సమయంలో పొందాల్సిన అనుభూతి ఎలా ఉంటుందో, ఎలాంటి ప్రతిచర్యకు పాల్పడాలో తెలియదు. తర్వాత చోకోలేట్స్ పళ్ళెంలో వేసి అందరికి నన్నే పంచమన్నారు. అది కూడా ఇబ్బందే నాకు. ఎందుకంటే అవి ఇస్తూ ఈ రోజూ నా పుట్టిన రోజు అని వాళ్ళకి నేనే చెప్పటం నాకు అసలు నచ్చలేదు. నా కొడుకు పుట్టినరోజు అని మా వాళ్ళే అందరికి చోకోలేట్స్ పంచాలి అనే ఫీలింగ్ లో నేను ఉన్నాను అపుడు. మొత్తానికి విఘ్నంతో మొదలయ్యి ఇబ్బందిగా ముగిసింది నాకు జరిగిన మొదటి పుట్టినరోజు పండగ.

తర్వాత ఎవడు నాకు పుట్టినరోజు జరిపిన దాఖలాలు దగ్గర్లో లేవు. ఎందుకంటే ఇంట్లో మళ్ళీ చెయ్యలేదు. స్కూల్లో చేసే అవకాశం లేకుండా ఆ టైమ్ కి వేసవి సెలవులు ఇచ్చేసేవాళ్ళు. ఇంక నాకు మంచి అభిప్రాయం కూడా లేకుండా పోయింది వాటి వల్ల. కొంచెం వయసు వచ్చాక, పుట్టినరోజు కి విషెస్ చెప్పటం, వాళ్ళకి ఆనందం ఇవ్వటం అలవాటు చేసుకున్నా. తర్వాత వేరేవేరే వాళ్ళతో విషెస్ చెప్పించి మరింత ఆనందపరచటం నేర్చుకున్నా. నాకున్న జ్ఞాపకశక్తి వల్ల అందరి పుట్టినరోజులు బాగా గుర్తు ఉండేవి. నేను గుర్తుపెట్టుకొని వాళ్ళకి విషెస్ చెప్పటం చెప్పించటం ఇలా సాగిన రోజులు బాగుండేవి. కాలేజి రోజుల్లో పుట్టినరోజులు వస్తే సాయంత్రాలు క్లాసుల్లోనే పండగ చేసుకోవటం, బయటకి వెళ్ళటం, తాగటం, తినటం ఇవన్నీ కూడా బాగుండేవి. అప్పట్లో ఫోటోలు, ఆ మొహాలు ఇప్పుడు చూడాలి.


ఎప్పుడైతే నేను ఈ నెలలో పుట్టానో నా పుట్టినరోజు గుర్తు పెట్టుకునే అవకాశం, వేడుక చెయ్యాలనే ఆలోచన ఎవరికి ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడే exams అవుతాయి. ఇంక ఆ సెలవుల టైమ్ కి నేను ఇంట్లోనే ఉండాలి. నేను అందరి పుట్టినరోజులు గుర్తు పెట్టుకొని విషెస్ చెప్పటం, నా పుట్టినరోజు ఎవరికి గుర్తు ఉండకపోవటం ఎక్కడా బేరీజు కుదిరేది కాదు. దీనివల్లే నేను నన్ను అందరూ నిర్లక్ష్య పెట్టారనే భావనలో ఉన్నాను. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ కొంత మాత్రం నాకు ఈ పుట్టినరోజు మీద ఉన్న భిన్నాభిప్రాయం మరియు అందరూ నాలాగే ఆలోచించాలి అనుకునే నా తత్వమే కారణం. నా పుట్టినరోజు ఇది అని నేను చెప్పుకోవటానికి ఇష్టపడను. నేను వాళ్ళ పుట్టినరోజు తెలుసుకున్నట్టే వాళ్లు ఎందుకు నా గురించి తెలుసుకోరు అని ఆలోచించాను కొన్ని సంవత్సరాలు. అయినప్పటికీ నా జీవితంలో ఇప్పటి వరకు ఆరు సార్లు కేక్ కట్ చేసినట్టు గుర్తు నాకు. నా చేత అలా చేయించిన వారికి నా జోహార్లు. 

ఆరేళ్ళ ముందు అసలు ఈ పుట్టినరోజు కథ ఏంటి అని తెలుసుకున్నాను. ఎందుకు ఈ కేక్, కేండిల్స్, బంప్స్ ఇస్తారు అని తెలుసుకున్నాను. ఆర్తీమదేవి(Artimus) అనే దేవతకు ఇష్టమైన పూర్ణ చంద్రుని ఆకారంలో కేక్ చేసి కొస్తారని ఏదో చదివాను. మనల్ని మనం పొగిడించుకోవటానికి పెట్టుకున్న పంచాయతీలే ఇవన్నీ అని అర్ధం అయింది. అసలు పుట్టినరోజు మీద కొంతమంది మేధావులకి వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రపంచం ఈ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తోంది. సోషల్ మీడియా పేరుతో వచ్చిన ఫేసుబుక్ మొదలైన వాటివల్ల మనుషులు జ్ఞాపకశక్తిని కూడా పక్కన పెట్టేసారు. ఎందుకు చెప్తున్నా అంటే గత రెండు సంవత్సరాలు నేను నా పుట్టిన తేదీని ఫేసుబుక్ లో దాచి పెట్టాను. నాకు విషెస్ చెప్పే ఆ పదిశాతం మందిలో ఒక్కడు కూడా చెప్పలేదు. అప్పుడు నాకు అర్ధం అయింది. ఇన్నాళ్లు చెప్పిన ఆ పది మంది కూడా ఫేసుబుక్ వల్లే చెప్పి ఉంటారు అని. ఇప్పుడు ఏం లేదు కానీ ఒకప్పుడు అయితే విషెస్ చెప్పటం, చెప్పించటం లో ఫ్రెండ్స్ ఎంతో కృషి చేసేవాళ్లు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా విషెస్ చెప్పమని నేను SMS చేస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇపుడు తెలిసినా కూడా చెప్పట్లేదు. అంతెందుకు నేను కూడా చాలామందికి చెప్పట్లేదు విషెస్. బోర్ కొట్టేసింది, ఇంకా అది పెద్ద విషయం కాదు అని జ్ఞానం వచ్చేసింది అందర్లోనూ.

గత నాలుగేళ్లుగా అంటే వాట్సాప్ లో డైనమిక్ స్టేటస్ లు పెట్టినప్పటి నుంచి ఈ పిల్లలు అందరూ దాన్ని happy birthday అని ఫోటోలు పెట్టడానికి ప్లేట్ఫామ్ గా వాడేసుకుంటున్నారు. అప్పట్లో orkut, hi5 ల్లో పెట్టిన scrap లు గుర్తు వచ్చేవి. ముందు నేను చెప్పినట్టు ఒక ఫ్రెండ్ పుట్టినరోజు వేరే ఫ్రెండ్స్ కి గుర్తు చెయ్యటానికి ఇది బాగా పని చేస్తుంది. కానీ ఇక్కడ చికాకు తెప్పించే విషయం ఒకటి ఉంది. ఒకడు నాకు విషెస్ చెప్తూ స్టేటస్ పెడితే నేను దాన్ని స్క్రీన్షాట్ తీసి నేను మళ్ళీ స్టేటస్ పెట్టేస్కోవాలా? దీని వల్ల నాకేం ఇబ్బంది లేదు కానీ మరీ టూ మచ్ అనిపిస్తుంది నాకు. ఈ రోజు నా పుట్టినరోజు అని చెప్పుకోవటమే ఇబ్బందిగా భావించే నాకు అలాంటి పనులు అంత గిట్టకపోవటాన్ని మీరు తప్పుగా అనుకుంటే అది నా తప్పు కాదు. కొంతమంది అయితే ఇది నా పుట్టినరోజు అని గుర్తు చెయ్యటానికి దేవుడికి thanks చెప్తూ స్టేటస్ పెడతారు. ఇది కూడా పై కోవకే వస్తుంది. నాకు నచ్చలేదు అని చెప్పట్లేదు కానీ అది కూడా డొంకతిరుగుడు వ్యవహారమే అని బల్లగుద్ది చెప్తాను. ఈ రోజు నేను కూడా అలాంటిది ఒకటి try చేశా. అందుకే కాస్త ఎక్కువ మంది నన్ను విష్ చేశారు ఈ సారి. ఇంకో డౌట్ కూడా ఉంది. ఏంటంటే ఒకడు రోజు ఎవరో ఒకరికి విషెస్ చెప్తూ స్టేటస్ లు పెడుతాడు. అసలు నిజంగా వాళ్ళు వీడి ఫ్రెండ్స్ ఏనా, వాళ్ళు అసలు ఈ స్టేటస్ లు చూస్తారా లేక మిగతా వాళ్ళు వీడికి చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది అనుకోవాలనో, లేక నిజంగా ఉంటే అందరికీ తెలియటం కోసం అలా షో చేస్తాడా అని. #justasking.


మా అమ్మ నేను ఏప్రిల్ 25 న పుట్టాను అని నా చిన్నప్పుడు చెప్పింది. కానీ స్కూల్ లో మాత్రం జులై 10 న రాయించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 25 రాత్రి 2 గంటలకి పుట్టాను అని చెప్పింది. అంటే ఏప్రిల్ 26 న చేసుకోవాలా, 25 న చేసుకోవాలా? సాంకేతికంగా 26 నే చేసుకోవాలి. కానీ మనం ఎప్పుడు పుట్టాం అనేది ఎవడికి అవసరం? అందరి పుట్టినరోజులు నిజం అవ్వాలని ఏముంది. వాళ్ళ అమ్మ ఇచ్చిన నమ్మకమే నిజం. అయినా మన పుట్టుక మన చేతిలో లేదు. మన చావు మన రాతలోనే ఉంది. కానీ మన బ్రతుకు మాత్రం మన చేతల్లోనే ఉంది. మన బ్రతుకుని బట్టి దేవుడు, మనం బ్రతికే తీరుని బట్టి ఎదుటివాడు మనల్ని తీర్పు తీరుస్తారు. మా అమ్మ ఇచ్చిన నమ్మకం, ఆమె నమ్మిన నిజం, నమోదు చేసిన అబద్దం మొత్తం మూడు పుట్టినరోజులు ఉన్నాయి నాకు. అవి చాలవు అన్నట్టు ఈ సంవత్సరం మాత్రం నాకు ఏప్రిల్ 23 న, 24 న కూడా విష్ చేసేశారు ఇద్దరు ముగ్గురు నా అత్యుత్సాహపు అభిమాన స్నేహితులు. ఏది ఏమైనా ప్రతి సంవత్సరం గుర్తు పెట్టుకుని నన్ను విష్ చేసే ఆ ఒకరిద్దరికి, ఒకప్పుడు గుర్తు ఉండి, ఇప్పుడు కన్ఫ్యూజ్  అయిన కొంతమందికి, మొత్తం మర్చిపోయిన వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. ఇది నా బ్లాగ్ నంబర్ 26, ఈ రోజు తేదీ 26, సమయం 2.10 IST  టెక్నీకల్ గా ఇప్పుడే నా పుట్టిన సమయం. 


Happy Birthday to #eckce


-eckce

5 comments:

Unknown said...

మొత్తానికి wishes చెప్పిన నాలాంటి వారికి ధన్యవాదములు చెప్పినందుకు, నీకు ధన్యవాదములు రాజు

Unknown said...

👌👌👌

Part of blog relateds to me toooo

Santhoshi said...

Ur writings are so catchy to everyone. Wish u Many more happy returns of the day. Good luck

Chittibabu said...

Technically correct birthday wishes raju...
Your writing skills excellent.

Kaizen mohan said...

అత్యుసాహపు అభిమాన స్నేహితునిగా నన్ను మెన్షన్ చేసినందుకు సంతోషపడాలో అతి వుస్తాహం ప్రదర్శిన్చనందుకు సిగ్గు పడాలో తెలియటం లేదు బావ నాకు

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...