B027 dated at Tadepalligudem the 18.06.T21.
ఏదో చెయ్యాలి అనుకుని చెయ్యలేకపోతూ ఉండటం, చేయలేదని బాధ పడటం జరుగుతూనే ఉంటాయి. కానీ అది ఎందుకు చేయలేకపోయాము అని మనకి మనం సమాధానం చెప్పుకొనే స్థితిలో అయినా ఉంటే అది చాలు. ఎందుకంటే కారణం బలంగా ఉంటేనే కదా కార్యరూపం కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన దానికి అర్ధం ఉంటుంది. నేను గత రెండు నెలలుగా ఎన్నో రాయాలి అనుకున్నాను. కానీ ఒకటి కూడా రాయలేకపోయాను. రాసే ఖాళీ లేక కాదు, నా రాత ఖజానా లో ఖలేజా లేక. ఇప్పుడు రాస్తున్నానంటే కళాఖండం ఏదో ఉందని కాదు, ఎందుకు రాయట్లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంతే. సారాంశం చివర్లో.
చిన్న చిన్న అంశాలు ఎన్నో నన్ను కదిలించినప్పటికీ దానికి తగిన పెద్ద పెద్ద అనుభవాలు నాకు లేకపోవటంతో పూర్తి అవగాహన సంపాదించుకోలేకపోయాను. అయినా మన అభిప్రాయం చెప్పటానికి క్షుణ్ణమైన జ్ఞాన పరిణీతి అక్కర్లేదని ఒకవేళ అది మనకి ఉన్నప్పటికీ అందరూ దానితో ఏకీభవించరు అని నాకు తెలుసు. కానీ ఒక బలమైన అనుభూతి ఏదో నాకు కలిగించినప్పుడో లేక బలవంతంగా ఎవరైనా నన్ను కదిలించినప్పుడోనే కదా నేను ఇక్కడ కనిపించేది. అందుకే ఆగిపోయాను. కానీ ఇంక ఆగే పరిస్థితి లేదు, సాగే సంస్కృతి తప్ప.
చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్న కొంతమందికి ఒక మంచి విషయం చెప్తే చక్కగా ఊ కొడతారు కానీ ఆచరణలో పెట్టడానికి ఎందుకు శ్రద్ధ పెట్టరో అర్ధం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తే బాధ పడతారనో, లేక మొత్తానికి వ్యతిరేకత చూపి కోప్పడతారనో భయపడి చెప్పకపోవటం వల్ల వాళ్ళు మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారనే అసంతృప్తి మనకి అలాగే ఉండిపోతుంది. అయినా చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకునే హుందాతనం చాలా తక్కువ మందికి ఉంటుంది. అహంకారానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్లు మాత్రమే మనం చెప్పే మంచిని మంచి అని నమ్మి స్వీకరిస్తారు. కానీ కొంతమంది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయానికి ఎక్కువ విలువివ్వటం వలన మన మాట పెడ చెవిన పెడతారు. ఎందుకంటే మనం చెప్పే మంచి కంటే కూడా వాళ్ళు చేసేదే మంచిదని వాళ్ళు నమ్మడం వలన మన మాటలు వినరు. ఒక్కోసారి వాళ్లే కరెక్ట్ అవ్వొచ్చు కూడా. అప్పుడు మనమే అభిప్రాయం మార్చుకోవాల్సి ఉంటుంది. మన మీద నమ్మకం లేని వాళ్ళు కూడా మన మాట వినరు. కానీ ఇది చాలా తక్కువ మంది విషయాల్లోనే జరుగుతుంది.
మరి కొంతమందికి వాళ్ళు చేసేది తప్పు అని తెలిసినా, మనం మంచి చెప్పినప్పుడు విని తర్వాత కావాలనే మర్చిపోయి మనల్ని విసిగిస్తారు. దీనికి కారణం వాళ్ళకి వినదగిన చెవులున్నప్పటికీ ఆచరించే ఆలోచన ఉండదు. అందుకే కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యరు. ఇలాంటి వాళ్లనే నేను ఎంతో మందిని ఇంటా బయటా చూస్తూనే ఉన్నాను.
ఒక్కటి మాత్రం నిజం, ఒకరి దృష్టిలో మనం సంపాదించిన స్థానం, వారికి మనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చటం అది మొదటిగా ఏర్పరుచుకున్నంత సులువు కాదు. మనపై పడ్డ చెడ్డ ముద్రని చెరిపెయ్యటానికి మనం ఎన్ని మంచి పనులు చేసినా ఒక్కోసారి సరిపోదు. కానీ మనపై పడ్డ మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకోవటానికి మాత్రం ఒక్క అపార్ధం చాలు.
ఇప్పుడు నేను రాసిందంతా రాజ్యాంగం కాదు. అందరికీ ఇదే అభిప్రాయం ఉండదు, ఎందుకంటే అందరికీ ఉన్న కామన్ సెన్స్ నాకున్న నాన్ సెన్స్ తో సమానంగా ఉండదు కాబట్టి వారి ఆలోచనలు, విధానాలు వేరుగా ఉంటాయి.
ఇలా ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో ముగించాల్సిరావటం వలనే ఇన్ని రోజులు రాయలేకపోయాను అనే ముగింపు వాక్యంతో ఈ అంశాన్ని ఇక్కడితో అంతం చేస్తున్నా.
-eckce
No comments:
Post a Comment