Sunday, August 28, 2022

Vaseekar

 B040/Vaseekar dated at Tadepalligudem the 27.08.T22


సాగితే జ్వరం అంత సుఖం లేదంట అనే ఒక పాత సామెత ఉంది అని ఆ మధ్య ఏదో సీరియల్ లో చూస్తే తెలిసింది. సుఖం ఎలా ఉన్నా గానీ జ్వరం అనేది నా దృష్టిలో అన్ని రోగాల కన్నా పెద్దది. ఇపుడు నాకు జ్వరం లేదు కాబట్టి దాని తాలూక సంగతులు వివరించలేను గానీ జ్వరం లో ఉన్నప్పుడు ఒక రకమైన మత్తు ఉంటుంది చూడండీ. అది నేను ఇపుడు అనుభవిస్తున్నాను. మూడు రోజుల ముందు జలుబు కోసం మూడు రోజుల కోర్సు వాడిన తర్వాత కూడా తగ్గకపోతే వేరే మందుల షాప్ కెళ్ళి విషయం చెప్తే వేరే స్ట్రాంగ్ మందులు ఇస్తా అన్నాడు. సై అన్నాను. మత్తు వచ్చేవి ఇవ్వమంటారా అంటే, మత్తు వస్తే ఎలా అండి పని చెయ్యాలి కదా అన్నాను. రెండు రోజులకు ఇచ్చాడు. రెండు పూటలే వేసుకున్నా. ఎందుకంటే వాటి నిషా నషాళానికి ఎక్కింది. ఇది మూడో రోజు, ఇప్పటికీ రోజు ఉదయం తొమ్మిది వరకు మెళకువ రావట్లేదు. మధ్యాహ్నం మత్తు నిద్ర వస్తుంది. పని మధ్యలో మందేసినట్టు మైకం వస్తుంది. ఆ మెడిసిన్ ఇచ్చిన వాడి దగ్గరకు వెళ్ళి తిట్టాలన్నా బద్ధకం గానే ఉంది. ఉన్న నాలుక ఊడిపోవటానికి అప్పుడప్పుడు కొండ నాలుకకు మందు వెయ్యాల్సిందే అని అనిపించేలా చేశాడు. అసలు ఒక సమస్యకి విరుగుడు వాడినప్పుడు అది వేరే సమస్యకి దారి తియ్యటం వెనక అసలు కారణం ఏమిటో అర్థం కాదు. ఇది చాలా విషయాల్లో జరుగుతుంది. Side effects లేని మందులు చాలా తక్కువ కనిపిస్తాయి. కొంతమంది దాన్నిలా సమర్ధిస్తారు. Side effect ఉంది అంటే మందు సరిగ్గా పని చేస్తుంది అని అర్థం అంటారు.

బహుశా ఒక సమస్య ను మర్చిపోవడం కోసమే వేరే సమస్య ను తగిలిస్తారేమో. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీత ఇంకా చిన్నగా కనిపిస్తుంది కదా. నిజమే నాకు ఈ నిద్ర మత్తు సమస్య వచ్చాక నాకు జలుబు ఉందని మర్చిపోయా. ఎందుకంటే ఈ రోజు ఆవిరి పట్టగానే జలుబు తగ్గిన ఫీలింగ్ కి వచ్చేశాను. కానీ నిద్ర మత్తు పోలేదు అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో చెప్పటం కోసం, దాని విషయంలో సొమ్ము చేసుకునే అవకాశం అందరికీ అంగట్లో ఉంది ఇపుడు. కాస్త అవగాహన ఉన్న ప్రతి ఒక్కడు పరమ వైద్యుడు అనే ఫీలింగ్ లో ఉన్నాడు. వాళ్ళకి తెలిసిందల్లా Facebook post ల్లోనూ, Whatsapp స్టేటస్ ల్లోనూ, YouTube shorts లోనూ చూసిందే. ఒకప్పుడు నేను కూడా ఇలా బిల్డప్ ఇచ్చిన వాడినే కాబట్టి అలాంటి వాళ్ళని ఇపుడు easy గా కనిపెడుతున్నాను. అందరూ అశ్రద్ద చేస్తూ అకస్మాత్తుగా శ్రద్ధ చూపించేది కోల్పోయిన వారి ఆరోగ్యం మీదే కదా. మన అజాగ్రత్త కొంతమందికి వ్యాపారంగా అయింది. కానీ కాలం ఎంత మారింది అంటే అసలు పరిష్కారం లేదు అనుకున్న సమస్యలెన్నిటికో సులువైన పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఈ మధ్యన. నేను 2013 నుంచి ఒక సమస్యతో పోరాటం చేస్తూ ఎంతో శ్రమించి ఎన్నో డబ్బులు తగలేసిన తర్వాత 2018 లో ఇక ఇంతేనా అనేసుకుని కూడా ఆపకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా వాటితో కానిది ఎంతో సులువుగా 2021 లో అయింది. అంటే ప్రతి సమస్యకూ ప్రతికూలత ఉంటుంది. ఆ సానుకూలత మనం సాధించాలి అంటే సంయమనం పాటించాలి. కానీ అది ఎక్కడ ఉందో వెతకాలి. సమస్య ఆరోగ్య పరమైనదైనా మానసికమైనది అయినా కూడా కొంత కోల్పోయాకే జ్ఞానం వస్తుంది. అది సమయం అయినా, సొమ్మైనా, ఇంకేమైనా. 


ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ మధ్య న్యూట్రిషియన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నారు. వారిలో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి సమాధానం ఎక్కడ పడితే అక్కడ చెప్పరు. దానికోసం ఒక చోటికి రమ్మంటారు. కావాలంటే మీరే ప్రయత్నించండి. వాళ్ళు మీకు రోడ్ మీద గానీ ఫోన్ లో గానీ ఆన్సర్ చెప్పరు. ప్రత్యేకమైన ప్రదేశానికి నేరుగా వెళ్తేనే మన సమస్య బట్టి సమాధానం చెప్తారు. కాస్త ఖరీదైన సమాధానం అది. ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా ఉంటుంది సుమీ. కానీ ఇక్కడే కాస్త రహస్యం ఉంది. ఫలితం అనేది మనం ఖరీదు పెట్టి కొన్న వైద్యం వల్ల కొంత శాతమే ఉంటుంది. కానీ దానిని ఉపయోగించే పద్దతిలో కొన్ని షరతులు ఉంటాయి చూడండీ. వాటి వల్ల అధిక శాతం ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీ ఇతర సమస్యల్ని కూడా వారు అడిగి అవి మీకు లేకపోయినా గుప్పించి తెలుసుకుంటారు. వాటన్నిటికీ వాళ్ళ దగ్గర ఏవో మందులు ఉన్నాయి అని చెప్తారు. అవి మీకు ఇస్తారు. అవి సరిగా పని చెయ్యాలి అంటే మిమ్మల్ని రోజులో రెండు పూటలు భోజనం మానేయమంటారు. ఆ భోజనం స్థానంలో వాళ్ళు ఇచ్చిన మందులు భుజించాలి. పైగా మనం సహజంగా తినే కొన్ని అనారోగ్య చిరుతిండి మానేయమని చెప్తారు. అరగంట వ్యాయామం తప్పనసరి అంటారు. ఇక్కడ రహస్యం ఏమిటి అంటే మనం మానేసిన చెత్త తిండి వలన కొంత, మనం రోజులో రెండు పూటలు చేసిన లంకణం వల్ల కొంత మన శరీరం ఐడియల్ పొజిషన్ కి వస్తుంది. వ్యాయామం వల్ల బరువు  తగ్గుతారు. ఆరోగ్యం పునరుత్ధరిస్తుంది. కానీ వాళ్ళు మీరు సొమ్ము పోసి కొన్న ఆ మందుల వల్లే ఇదంతా జరిగింది అనే భ్రమను మీకు కలిగిస్తారు. దానికి మిమ్మల్ని దాసోహం అనేలా తయారు చేసి పడేస్తారు. సాధారణంగా మనకి తీరని సమస్యని కాస్త సులువైన పద్దతిలో తీర్చారు అనే కుతూహలంతో మనం కూడా బానిస అయిపోయాం వారి మందులకి. వారి వ్యాపారానికి మనమే బై ప్రొడక్ట్ అవుతాం. ఇక్కడ బాధాకరమైన సంగతేమిటి అంటే మన సమస్య శాశ్వతంగా తీరదు. అవి మానేసాక మళ్ళీ మాములే. కాబట్టి వాళ్ళకి మనం శాశ్వతమైన సరుకు గా మారిపోతాం. ఇప్పుడు నేను చెప్పినదంతా నా అనుభవం మాత్రమే. నేను చెప్పిన వాటిలో వంద శాతం నిజం లేకపోవచ్చు. కానీ వంద శాతం అబద్దం అయితే కాదు. ఇది చదివిన వారిలో ఇరు వర్గాల ప్రజలు ఉండొచ్చు. సమస్య మీది అయినప్పుడు దానికి సరైన పరిష్కారం వెతుక్కునే అవకాశం మీకే ఉంది. అది మీ హక్కు. నేను చెప్పిన వాటితో synchronize అయిన వాళ్ళు తప్పకుండా స్పందిస్తారు అనుకుంటున్నాను. నేను కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే ఇది చెప్పట్లేదు అని అర్థం చేసుకోగలరు. మరింత వివరణకై కింద చదవండి.


సింపుల్ లాజిక్ ఏంటీ అంటే మనం ఏదైనా విషయంలో బలహీనంగా భావిస్తున్నాం అనే విషయాన్ని బయట పెట్టడమే మనం చేస్తున్న పొరపాటు. నీకొక లోపం ఉన్నప్పుడు దాన్ని నువ్వు లోపంగా కానీ సమస్యగా కానీ భావిస్తున్నట్టు ఎవరికైనా చెప్తే దాన్ని వారో వేరొకరో బలంగా మార్చుకునే అవకాశం వారికి ఇస్తున్నట్టే. నీ సమస్య అనే ఎమోషన్ వారికి weapon అవుతుంది. దానిని సరైన రీతిలో వాడి నిన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. డబ్బు లేదని, మనశ్శాంతి లేదని, శారీరక సమస్యలు ఉన్నాయని, ప్రేమ లేదని, సుఖం లేదని ఇలా నీకు లేవు అని వేటిని అయినా చూపిస్తే వాటిని నీకు ప్రత్యక్షంగానో పరోక్షం గానో ఇస్తా అని, ఇప్పిస్తా అని, రప్పిస్తా అని, అవే వచ్చేస్తాయి అని మాయ మాటలు చెప్పే మాంత్రికులు, సోదికాండ్రు, వశీకరులు, దొంగ అనే prefix చేర్చగలిగిన వైద్యులు, దైవ సేవకులు, బాబాలు, పూజారులు ఇలా ఎన్నో రూపాల్లో మన చుట్టూనే తిరుగుతున్నారు. ఇందులో ఎక్కువశాతం టీవీ ల్లోనూ, సోషల్ మీడియాలోనూ ads రూపం లో కనిపిస్తారు. వాళ్ళే డేంజర్. సులువుగా చిక్కులు పెట్టగలిగిన తాంత్రిక శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను మొసపోయినా కూడా నా వల్ల వాడు లాభ పడ్డాడు అనే ధోరణిలో బతికెయ్యగలను. కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా. మనం చేయాల్సిందల్లా మోసపోయే ముందు మన సమస్యకు తగిన పరిష్కారం మన దగ్గరే ఉంటుంది అని నమ్మటం. All the best.




-eckce

8 comments:

Srihagya💖 said...

Super macha, every word is true

Srihagya💖 said...

👏👏👍👍✨

Unknown said...

Super super

Avb1994 said...

👍👍👍👍👌👌👌👌

Unknown said...

👍👍👍

Bala Sundar Raj said...

ఈ సందేశం చదువుతూ వుంటే మీలో ఒక డాక్టర్, ఒక తత్వవేత్త, ఒక సాంఘీక సంస్కర్త, ఇలా లైన్ లైన్ కి ఒక్కో పాత్రలో కనిపించారు మిత్రమా

Mohan said...

ఇంత వేదాంతం ఎప్పుడు నేర్చుకున్నావు

Ananth said...

👌👌

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...